Krishna River Overflow: కృష్ణా ఉగ్రరూపం దాలుస్తోంది. బ్యారేజికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కరకట్ట ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అందులో భాగంగా అక్కడనే ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసం వద్దకు ఉండవల్లి పంచాయతీ అధికారులు చేరుకున్నారు. ఇంటికి నోటీసులు అంటించారు.
ఆయన ఇంటితో సహా 36 భవనాలకు హెచ్చరికలు జారీ చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో కరకట్ట ప్రాంతం వద్ద నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు పంపారు.
కొండవీటి వాగుకు వరద నీరు పోటెత్తింది. ఆరు లక్షల నీరు చేరింది. రాజధాని ప్రాంతాల్లో ఉన్న తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని పంట పొలాలు మునిగిపోయాయి. దీంతో కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా నదిలోకి నీటిని పంపించేస్తున్నారు.
గత సంవత్సరం ఇదే విధంగా కరకట్ట ప్రాంతానికి వరద నీరు పోటెత్తింది. అక్రమ కట్టడంలో బాబు ఉంటున్నారని, నదీ గర్భంలో ఎలా కట్టుకుంటారని వైసీపీ నేతలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశం వివాదాస్పదమైంది. రాబోయే రెండు రోజుల పాటు ఇదే విధంగా వరద ప్రవాహం ఉంటుందని, బాబు నివాసానికి రెండో నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
నారాయణపూర్‌కు దిగువన పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ఉధృతి పెరిగింది. జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న 4.35 లక్షల క్యూసెక్కులకు సుంకేశుల బ్యారేజీ నుంచి విడుదల చేసిన 77 వేల క్యూసెక్కుల తుంగభద్ర నదీ జలాలు కలుస్తుండటంతో.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,10,750 క్యూసెక్కులు చేరుతోంది.