క్రమశిక్షణతోనే కరోనాను గెలవగలం.. కష్టమైనా కొన్ని నిర్ణయాలు తప్పదు : జగన్

  • Publish Date - March 26, 2020 / 01:51 PM IST

పొరపాటుచేస్తే, పరిస్థితి ఎక్కడిపోతుందో మనకు తెలియదు. అందుకే ఎక్కడివారు అక్కడే  ఉండండి. మీకు ఎలాంటి అవసరమున్నా వెంటనే 1902కి కాల్ చేయండి. మీకు కావాల్సిన సాయం అందుతుంది.  ఎక్కడివారు అక్కడే ఉండిపోండి. వసతులుపరంగా ఎలాంటి లోటు చేయమని… అన్నివిధాలుగా బాగా చూసుకొంటామని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ భరోసానిచ్చారని అన్నారు సీఎం జగన్. 

‘రాష్ట్రంలో ఇప్పటికీ 10 పాజిటీవ్ కేసులున్నాయి. జాగ్రత్తగా లేకపోతే ఈ కేసులు పెరుగుతాయి. అందరం కలిసి చేస్తేనే వైరస్‌ను అడ్డుకోగలం. రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన 27, 819 మందిని మేం ట్రాక్ చేశాం.. వాళ్ల మీద నిఘా ఉంచాం. వాళ్ల ఆరోగ్యాన్ని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నాం.  క్రమశిక్షణతోనే కరోనాను గెలవగలమని, నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాం. కొంచెం కష్టమైనా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని జగన్ తెలిపారు. 

అవసరమైతేనే రండి. కనీస అవసరాల కోసమే బైటకు రండి. మిగిలిన సమయమంతా ఇంట్లోనే ఉండండి. కరోనా కట్టడికి ఇది చాలా ముఖ్యం. దేశమొత్తంమీద లాక్ డౌన్ ఉంది. రాష్ట్రాల మధ్యనే కాదు, ప్రాంతాలు, పట్టణాల మధ్య కూడా రాకపోకలు ఆగిపోవాలి. లేదంటే మనకు తెలియకుండానే మనం కరోనాకు గురికావచ్చు. మనమే క్యారియర్స్ లా మరికొంతమందికి వ్యాప్తిచేయచ్చు.కాబట్టి మనం గడప దాటకూడదన్నది జగన్ మాట.

ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే… ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలి. మార్చి 29 నుంచి బియ్యం, పప్పు అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 4నాటికి ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సర్వే చేయిస్తున్నాం. కరోనా లక్షణాలు కనిపిస్తే వాళ్లకు గ్రామవాలంటీర్లు, ఆశావర్కర్స్ వాళ్లకు వైద్యసాయం చేస్తారు. ఇవన్నీ జరగాలాంటే మీరు ఇళ్లలోనే ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. 

ఆ సిబ్బందికి హ్యాట్సాఫ్ : 
ఇలాంటి కరోనా వందేళ్లకొకసారి వస్తుందోరాదో తెలియదు. మనం దీన్ని అడ్డుకోవాలి. ప్రభుత్వం వైపు చేయగలిగేదంతా చేస్తాం. డాక్టర్లు, నర్సులు, వాలంటరీర్లు, మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ విభాగం, పోలీసులు రిస్క్ తీసుకొని కరోనా కంట్రోల్ చేస్తున్నారు. వీరికి మనం మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని జగన్ అన్నారు.