×
Ad

Gulab Cyclone : ఏపీలో ‘గులాబ్’ బీభత్సం…పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు

ఏపీలో గులాబ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. గులాబ్‌ తుపాను విజయనగరం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది.

  • Published On : September 28, 2021 / 06:12 PM IST

Ap Floods

overflowing rivers and streams : ఏపీలో గులాబ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గులాబ్‌ తుపాను విజయనగరం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు, నదులు ఉధృతంగా పొంగుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. రహదారులు నీట మునిగాయి. కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

గులాబ్‌ తుపాను పశ్చిమగోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రహిస్తున్నాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో అక్కడక్కడ గండ్లు పడ్డాయి. దెందులూరు-సత్యనారాయణపురం మధ్య జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. పొలాల్లోకి నీరు చేరడంతో పంటలకు నష్టం జరిగింది.

Gulab Cyclone : ఏపీని గజగజలాడిస్తున్న గులాబ్‌!

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూ.గో, ప.గో, కృష్ణా జిల్లాల్లో కుంభవృష్టిగా పడుతోంది. ఉత్తరాంధ్రలోని 277 మండలాల్లోనూ వానలు దంచికొడుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98 మండలాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. గంటకు 60 కి.మీ నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో 24.3 సెం.మీ, విజయనగరం జిల్లాలో 23.4 సెం.మీ, విశాఖ నగరంలోని 57 చోట్ల 20 నుంచి 34 సెం.మీ వర్షం , ప.గో జిల్లాలో అత్యధికంగా 12 సెం.మీ. పైగా వర్షం పడింది. తూ.గో జిల్లాలో 10 సెం.మీ నుంచి 16 సెం.మీ వానలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో 10 సెం.మీ నుంచి 14.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Cyclone Gulab Effect : ఏపీలో దంచి కొడుతున్న వానలు

విజయనగరం జిల్లాలో 147 విద్యుత్తు సబ్‌స్టేషన్లపై తుపాను ప్రభావం పడింది. వందలాది గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. 6 జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలోనే 13,122 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వేర్వేరు ఘటనల్లో ఆరుగురి మృతి చెందారు.