Cyclone Gulab Effect : ఏపీ లో దంచి కొడుతున్న వానలు

గులాబ్ తుపాన్ కారణంగా ఏపీ లోని పలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది.

Cyclone Gulab Effect : ఏపీ లో దంచి కొడుతున్న వానలు

Ap Rains

Cyclone Gulab Effect : గులాబ్ తుపాన్ కారణంగా ఏపీ లోని పలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి ప్రధాన రహదారులు సహా కాలనీలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటితో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.

డ్రైనేజీలు ఉప్పొంగటంతో మోకాలు లోతు మేర వర్షపు నీరు నిలిచి స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. నగర శివారు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షంతో ..కండ్రిక,ఎల్ బీఎస్ నగర్ , పాయకపురం, రాజీవ్ నగర్ ప్రాంతాలలో వరద నీరు ఇళ్ళలోకి చేరింది. నున్న పోలీస్టేషన్ నీట మునిగింది.  నూజివీడు-విజయవాడ రహదారీ లో రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది.

మరోవైపు గన్నవరం విమానాశ్రయం ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. బెంగుళూరు నుండి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం వర్షం కారణంగా ల్యాండ్ అయ్యేందుకు వీలు లేక అరగంటకు పైగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. సుమారు 12 రౌండ్లు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం వాతావరణం అనుకూలించటంతో రన్ వే పై ల్యాండ్ అయ్యింది.

గులాబ్‌ తుపాను తీరం దాటిన తర్వాత తీవ్రవాయుగుండంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. రాగల 6 గంటల్లో అది వాయుగుండంగా బలహీనపడుతుందని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.

ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తరాంధ్రలో గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలని కన్నబాబు కోరారు.

అటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో కూర్మన్నపాలెం గేట్ నుంచి కనితి బస్ స్టాప్ దాకా గులాబ్ తుఫాన్ దాటికి మొత్తం నీట మునిగింది.  వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనితి బస్ స్టాప్ నుంచి కూర్మన్న పాలెం వెళ్లే వైపు మొత్తం వాహనాలు దారి మళ్లించారు. విశాఖ జనరల్ ఆస్పత్రి నుంచి అగనంపూడి వెళ్ళే దారి మీదగా వాహనాలు మళ్లింపు చేశారు. రోడ్లమీద భారీగా వీరు నిలిచి పోయింది.స్టీల్ ప్లాంట్ కి వెళ్ళే ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కిలోమీటర్ల మేర వర్షపు నీరు నిలిచిపోయింది.

గులాబ్ తుపాను కారణంగా విజననగరం జిల్లా  వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  గజపతినగరంలో 61 మంది, తెర్లాము మండలం జి.గదబవలస నుంచి 18 మందిని  అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికి ఆహారం, త్రాగునీరు సరఫరా చేశారు.  తుఫాన్ కారణంగా సుమారు 13,122 హెక్టార్లలో పంటలు, 291 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిళ్లినట్లు ప్రాధమికంగా అంచనా వేశారు.   9 పశువులు మృతి చెందాయి.  వర్షాల కారణంగా   2.3 కిలోమీటర్ల మేర రోడ్లు, 1.2 కి.మీ. మేర కాలువలు కొట్టకుపోయాయి.  దీంతో అధికారులు  పునరుద్ధరణ పనులను హుటాహుటిన చేపట్జారు.  విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగిని  ప్రాంతాల్లో విద్యుత్ ను  పునరుద్ధరించారు.  నేల కూలిన చెట్లను, రాత్రికి రాత్రే తొలగించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.  జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్లు కంట్రోల్ రూమ్ నుంచి పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు.