Paderu Bus Accident
RTC Bus Accident : అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వ్యూ పాయింట్ దగ్గర 100 అడుగల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. చెట్టు కొమ్మను తప్పించబోయి లోయలోకి బస్సు దూసుకెళ్లింది. వైజాగ్ నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కూడా పాడేరు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటే ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో అక్కడ ఒక చెట్టు కొమ్మ ఘాట్ రోడ్డులో పడిపోయింది. అయితే, ఈ కొమ్మను తొలగించకుండా వాహనాలు నడుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ చెట్టు కొమ్మను తప్పించబోయి పాడేరు నుంచి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. దాదాపుగా 100 అడుగుల లోతులో బస్సు పడింది. లోయలో పడిన వారి బయటకు తీసుకొచ్చే సాహసం కూడా ఎవరూ చేయలేని పరిస్థితి ఉంది.
సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో 30మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వారిలో 12మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొంతమందిని పాడేరు ఏరియా ఆసుపత్రికి, మరికొందరిని చోడవరంలోని ఆసుపత్రికి తరలించారు. కొందరిని మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. వ్యూపాయింట్ దగ్గర మలుపు వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. కొంతమంది కిటికీలోంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం చెట్టు కొమ్మే అని స్పష్టంగా తెలుస్తోంది. చెట్టు కొమ్మను తప్పించబోయి బస్సులో లోయలోకి దూసుకెళ్లింది.