Gouthu Sireesha : వైసీపీ నేత జోగి రమేశ్ వ్యవహారంపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. నూజివీడులో ఏదో జరిగిందని అందరూ అడుగుతున్నారని ఆమె చెప్పారు. నెల రోజుల క్రితమే అక్కడ కార్యక్రమం ఉందని గౌడ సంఘం పిలిచిందన్నారు. గౌతు లచ్చన్న మనవరాలిగా నన్ను పిలిచారు, నేను వెళ్లాను అని తెలిపారామె. అనేకసార్లు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలకు నేను వెళ్లానని తెలిపారు. జోగి రమేశ్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం.. తెలిసి జరిగింది కాదు.. తెలియక జరిగిందని గౌతు శిరీష వివరణ ఇచ్చారు.
‘తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉంది. సోషల్ మీడియాలో ఏ చర్చ జరిగినా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేది నేనే. పలాసలో టీడీపీలోకి వస్తామన్న వారిని.. పార్టీ కార్యాలయం గేట్ వద్దకి కూడా రానివ్వడం లేదు. ఇదీ నా నిబద్దత. ఎమ్మెల్సీ పోతుల సునీతను పార్టీలోకి తీసుకోవద్దని మొదట చెప్పింది నేనే. తెలియక జరిగిన విషయంపై టీడీపీ వాళ్లే రాద్దాంతం చేస్తుంటే బాధగా ఉంది. నాకు సోషల్ మీడియా హరాస్ మెంట్ లు కొత్త కాదు. కానీ.. సొంత పార్టీ నుండే ఏం జరిగిందో తెలుసుకోకుండా హరాస్ మెంట్ చేయడం బాధగా ఉంది. గౌతు లచ్చన్న మనవరాలిగా మాత్రమే నేను ఆ కార్యక్రమానికి వెళ్లా. గౌతు లచ్చన విగ్రహావిష్కరణకు నిర్వాహాకులు ఎవరెవరిని పిలిచారో నాకు తెలీదు. ఈసారి ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే.. ఎవరెవరిని పిలిచారో తెలుసుకుంటానని పార్టీ పెద్దలకు, సోషల్ మీడియా వారికి మాటిస్తున్నా’ అని గౌతు శిరీష అన్నారు.
నిన్న నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేశ్ కూడా పాల్గొన్నారు. ఆయనతో కలిసి టీడీపీ నేతలు చెట్టపట్టాలేసుకుని తిరగడం వివాదానికి దారితీసింది. ఆ కార్యక్రమంలో మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. జోగి రమేశ్ తో వారు కలిసి ఉండటం టీడీపీలో పెను దుమారం రేపింది. చంద్రబాబును దూషించిన వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఏంటని టీడీపీ క్యాడర్ మండిపడుతోంది. దీనిపై మంత్రి లోకేశ్ సైతం సీరియస్ అయ్యారు. క్యాడర్ కు ఎలాంటి సందేశం పంపుతున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహించారు. దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషను లోకేశ్ అడిగారు.
Also Read : జోగి రమేశ్‌ను ఎవరు రమ్మన్నారు? మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే శిరీషలపై నారా లోకేశ్ సీరియస్..