పామర్రులో టీడీపీకి ఎందుకీ పరిస్థితి? ఈ ఎన్నికల్లో కనిపించబోయే సీనేంటి?

Pamarru: ఎన్టీఆర్‌ సొంత ఊరు నిమ్మకూరు ఉన్న పామర్రు నియోజకవర్గంలో ఎట్టిపరిస్థితుల్లో విజయం సొంతం చేసుకోవాలని పట్టుదల ప్రదర్శిస్తోంది.

Pamarru Assembly constituency: టీడీపీ వ్యవస్థాపకులు, అన్న ఎన్టీఆర్‌ సొంత నియోజకవర్గం పామర్రు.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన పామర్రులో ఓటర్లు వరుసగా అధికార వైసీపీకే జైకొడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లు ప్రతిపక్ష టీడీపీకి అంతుచిక్కని తీర్పునిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి.. రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు ఉన్న పామర్రులో టీడీపీకి ఎందుకీ పరిస్థితి? ఈ ఎన్నికల్లో కనిపించబోయే సీనేంటి?

కమ్యూనిస్టులకు కంచుకోట నిడుమోలు నియోజకవర్గమే పామర్రుగా మారింది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో సీపీఎం ఓటుబ్యాంకు ప్రభావం ఎక్కువ. 14 సార్లు ఎన్నికల్లో సీపీఎం ఆరు సార్లు విజయం సాధించి తన ఆధిక్యతను నిలబెట్టుకుంది. అదేవిధంగా రద్దయిన నిడుమోలు, ఉయ్యూరు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలతో పామర్రు ఏర్పాటైంది. ఉయ్యూరు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాలు, నిడుమోలులోని మొవ్వ, గుడివాడ సెగ్మెంట్ పరిధిలోని పెదపారుపూడి, పామర్రు మండలాలతో కొత్తగా పామూరు నియోజకవర్గం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది.

1962లో సీపీఐ గెలుపు
నిడుమోలు నియోజకవర్గం నుంచి 1962లో సీపీఐ అభ్యర్థి గుంటూరు బాపయ్య గెలుపొందారు. 1967, 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి కే.సోమేశ్వరరావు, 1978లో సీపీఎం అభ్యర్థి గుంటూరు బాపనయ్య విజయం సాధించారు .1979 ఉప ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి జి.ధనసూర్యవతి ఇక్కడ గెలుపొందారు. 1983లో టీడీపీ అభ్యర్థి జి.మల్లికార్జునరావు విజయం సాధించగా, 1985లో సీపీఎం నేత పాటూరు రామయ్య ఎమ్మెల్యేగా గెలిచారు.

అలా ఆయన వరుసగా నాలుగు సార్లు ఇక్కడ గెలుపొందారు. 1999లో గోవాడ మరియకుమారి టిడిపి తరపున విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పామర్రు నియోజకవర్గం ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డివై దాస్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఉప్పులేటి కల్పన విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్ కుమార్ అత్యధిక మెజార్టీతో విజయం సొంతం చేసుకున్నారు.

పామర్రు నియోజకవర్గంలో 1,83,158 ఓట్ల ఉన్నాయి. వీరిలో పురుషులు 88 వేల 815 మంది ఉంటే మహిళల ఓట్లు 94 వేల 340. ఓటర్లలో ఎస్సీలు ఎక్కువగా ఉండటంతో ఆ వర్గానికి రిజర్వు చేశారు. ఎస్సీల్లో మాల సామాజిక వర్గం ఓటర్లు 26 వేల 118 ఉంటే, మాదిగలు 25 వేలు నమోదయ్యారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు 12 వేల 300, కాపులు 19 వేల 700, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు 6 వేల 500, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు సుమారు 30 వేలు ఉంటారు.

నిర్ణయించేది మాత్రం బీసీ ఓటర్లే
నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించినప్పటికీ కమ్మ సామాజిక వర్గం అధిపత్యమే కొనసాగుతోంది. అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయించేది మాత్రం బీసీ ఓటర్లే.. దాదాపు 30 వేలకు పైగా ఉన్న బీసీ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపితే విజయం వారినే వరిస్తుందంటున్నారు పరిశీలకులు.

పామర్రు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలు హారాహోరీగా పోటీపడ్డాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత డివై దాస్ 6 వేల 940 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 23 వేల 438 ఓట్లు పొంది, టీడీపీకి దెబ్బతీసింది. ఇక 2014లో వైసీపీ నుంచి పోటీచేసిన ఉప్పులేటి కల్పన సీనియర్‌ నేత వర్ల రామయ్యను ఢీకొట్టారు. ఈ ఎన్నికల్లో కేవలం ఒక వెయ్యి 69 ఓట్ల తేడాతోనే వైసీపీ విజయం సాధించింది.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున కైలే అనిల్ కుమార్ పోటీ చేయగా, ఆయన ప్రత్యర్థిగా ఉప్పులేటి కల్పన పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ 30 వేల 873 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం మీద 56 శాతం ఓట్లను సొంతం చేసుకుని ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ మళ్లీ పోటీ చేస్తున్న కైలే అనిల్‌కుమార్‌ రెండోసారి తనదే విజయమంటున్నారు.

కొత్త అభ్యర్థిని తెరపైకి..
ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. గత రెండు ఎన్నికల్లో అభ్యర్థులను మార్చిన టీడీపీ.. ఈ సారి సీనియర్‌ నేత వర్ల రామయ్య కుమారుడు కుమార్‌రాజాను బరిలోకి దింపింది. చాలా కాలం క్రితమే ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది.

Also Read: రాజంపేటలో హోరాహోరీ సమరం.. రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం

ఎన్టీఆర్‌ సొంత ఊరు నిమ్మకూరు ఉన్న పామర్రు నియోజకవర్గంలో ఎట్టిపరిస్థితుల్లో విజయం సొంతం చేసుకోవాలని పట్టుదల ప్రదర్శిస్తోంది. కుమార్‌రాజా కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పరిచయాలు పెంచుకున్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి జరుగుతున్న ఈ సమయంలో పామర్రులో గెలిచి మహానేతకు అసలైన నివాళి అర్పిస్తామంటున్నారు కుమార్‌రాజా.

మొత్తానికి రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. సహజంగా మాల సామాజిక వర్గం నేతలకు ఈ స్థానాన్ని కేటాయిస్తుంటారు. కానీ, ఈ సారి టీడీపీ మాదిగ నేతకు టికెట్‌ ఇచ్చి మరో ప్రయోగానికి సిద్ధమైంది.

Also Read: చంద్రబాబుకి ఆ పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తోంది: జగన్

ఇక్కడ ఇంతవరకు గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు మాల సామాజికవర్గం వారే… దీంతో టీడీపీ ప్రయోగం ఎంతవరకు వర్క్‌ అవుట్‌ అవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నియోజకవర్గానికి కొత్త అయిన కుమార్‌రాజా, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ను ఢీకొట్టే పరిస్థితిపైనా చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా ఎన్టీఆర్‌ స్వస్థలంలో ఏ పార్టీ గెలిచినా అదో చరిత్రగానే నిలవనుంది.

ట్రెండింగ్ వార్తలు