రాజంపేటలో హోరాహోరీ సమరం.. రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం

Rajampet: రాజంపేట నుంచి పెద్దిరెడ్డి కుమారుడు, సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డికి సవాల్ విసురుతున్నారు.

రాజంపేటలో హోరాహోరీ సమరం.. రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం

Rajampet

రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న రెండు రాజకీయ కుటుంబాలు అవి… ఒకే జిల్లా.. ఒకే సామాజిక వర్గం.. ఇంకా చెప్పాలంటే ఒకే నియోజకవర్గం.. కానీ, ఒకరంటే ఒకరికి గిట్టదు. ఈ వైరం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా తాతలు, తండ్రుల కాలం నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయ శత్రుత్వం నడుస్తోంది. కానీ, ఎప్పుడూ ఒకరినొకరు ఢీకొట్టలేదు.

ఇన్నేళ్లలో ఒక్కసారి పరస్పరం పోటీ చేయలేదు. అయినప్పటికీ ఒకరిని దెబ్బ కొట్టేందుకు ఇంకొకరు వ్యూహాలు పన్నుతూనే ఉంటారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించే ఈ స్టోరీలో తొలిసారిగా హైడ్రామకు తెరలేచింది. దశాబ్దాల ఆధిపత్య పోరాటంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఇరు కుటుంబాలు రెడీ అయ్యాయి. తొలిసారిగా ఢీ అంటే ఢీ అన్నట్లు నేరుగా తలపడుతున్నాయి….. మరి ఈ హోరాహోరీలో గెలిచేది ఎవరు? నిలిచేది ఎవరు?

రెండు కుటుంబాలు.. అమీతుమీ..
రాయలసీమలో రాజకీయంగా గట్టిపట్టున్న రెండు కుటుంబాలు ఈ సారి రాజంపేట నియోజకవర్గం నుంచి అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఒకే జిల్లాకు చెందిన రెండు రాజకీయ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. ఆ రెండు కుటుంబాల్లో ఒకటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిది కాగా, రెండోది రాష్ట్ర సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం…. ఈ ఇద్దరు నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు కేంద్రంగా రాజకీయాలు మొదలుపెట్టిన వారే. కిరణ్‌కుమార్‌ తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి నుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.

రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నప్పుడూ ఇదే పరిస్థితి. కాలక్రమంలో ఇరు కుటుంబాలు రెండు వేర్వేరు పార్టీల్లో చేరాయి. కాగా, మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీలో చేరిన తర్వాత రాయలసీమ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది. పెద్దిరెడ్డితోపాటు, ఆయన సోదరుడు, కుమారుడు కూడా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ తమ హవా కొనసాగిస్తున్నారు.

విభజన ఎఫెక్ట్‌తో..
ఇదే సమయంలో 2014 వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి…. రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో రాజకీయంగా కనుమరుగయ్యారు. కొద్దికాలం క్రితం బీజేపీలో చేరి తిరిగి యాక్టివ్‌ అవ్వగా, ఆయన సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తూ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

ఇక రెండు కుటుంబాలకు ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి. ఇన్నేళ్ల రాజకీయ శత్రుత్వంలో ఎన్నడూ లేనట్లు ఇరుకుటుంబాలకు చెందిన నేతలు నేరుగా తలపడుతుండటం రాయలసీమ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మహా సంగ్రామానికి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం వేదికగా మారింది. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గంగా ఏర్పాటైంది.

ఈ నియోజకవర్గం పరిధిలో పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబల్లపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. గత 40 ఏళ్లలో రాజంపేట లోక్‌సభ స్థానానికి 13 సార్లు ఎన్నికలు జరిగితే… 9 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. ఇక గత రెండుసార్లు వైసీపీ జెండా రెపరెపలాడింది. ఈ రెండు సార్లూ మంత్రి పెద్దిరెడ్డి తనయుడు, వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా, 2014లో తొలిసారి ఓ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను ఓడించిన మిథున్‌రెడ్డి… ఈ సారి ఏకంగా మరో మాజీ ముఖ్యమంత్రితో తాడోపేడో తేల్చుకోబోతున్నారు.

రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి హవాయే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఏడు నియోజకవర్గాలకు రెండు స్థానాల్లో పెద్దిరెడ్డి ఒకచోట, ఆయన తమ్ముడు మరోచోట ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి ఏడు నియోజవకర్గాల్లో పటిష్టమైన నెట్‌వర్క్‌ ఏర్పాటుచేసుకుని రాజకీయంగా దూసుకుపోతున్నారు. ఐతే ఈ సారి వీరి హవాకు చెక్‌ పెట్టేందుకు మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీకి దిగడం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.

టీడీపీయేతర పార్టీలదే హవా
వాస్తవానికి రాజంపేట నియోజకవర్గంలో టీడీపీయేతర పార్టీలదే హవా. టీడీపీ 40 ఏళ్ల చరిత్రలో కేవలం రెండుసార్లే రాజంపేటలో గెలిచింది. ఇక్కడ పసుపు జెండా ఎగిరి సుమారు పాతికేళ్లు కావస్తోంది. 1999లో చివరిసారి టీడీపీ అభ్యర్థి గునిపాటి రామయ్య ఎంపీగా విజయం సాధించారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తొలి నుంచి ఈ స్థానాన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. ఎప్పుడూ ప్రతికూల ఫలితాలు వస్తున్నందున పొత్తులు ఉంటే ఇతర పార్టీలకే రాజంపేట వదిలేస్తుంటారు.

పొత్తులులేని సమయంలోనే టీడీపీ తరఫున అభ్యర్థులను నిలుపుతుంటారు. 2014లో పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చిన ఈ స్థానాన్ని ఇప్పుడు కూడా కమలం పార్టీకే కేటాయించారు. అప్పట్లో ప్రస్తుత బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో స్థానికుడైన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తుండటంతో హైటెన్షన్‌ కనిపిస్తోంది. 2009లో చివరిసారి పీలేరు ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తిన్నారు. కొద్దిరోజుల క్రితమే మళ్లీ బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాలు నడుపుతున్నారు. ప్రస్తుతం రాజంపేట నుంచి పెద్దిరెడ్డి కుమారుడు, సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డికి సవాల్ విసురుతున్నారు.

ఐతే మైనార్టీలు ఎక్కువగా ఉన్న రాజంపేట నియోజకవర్గంలో కిరణ్‌కుమార్‌రెడ్డి నెగ్గుకురాగలరా? అన్న సందేహాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో సుమారు మూడు లక్షల మైనార్టీ ఓట్లు వైసీపీకి అడ్వాంటేజ్‌గా చెబుతున్నారు. ఇదే సమయంలో ఎంపీగా రెండుసార్లు పనిచేసిన మిథున్‌రెడ్డి పరపతి కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ఇద్దరి మధ్య పోరు హీట్‌పుట్టిస్తోంది.

ఆధిపత్య పోరుకు ఫుల్‌స్టాప్‌?
మొత్తానికి రాజంపేటలో రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుకు ఈ ఎన్నికలతో ఫుల్‌స్టాప్‌ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పదేళ్ల రాజకీయ విరామం తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగడం… ఈ ఎన్నికల్లో గెలుపు ఆయన రాజకీయ జీవితానికి మలుపు తిప్పే అవకాశం ఉండటంతో చెమటోడ్చుతున్నారు. కూటమి పార్టీలను కలుపుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఐతే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల బీజేపీతో కలిసి ప్రచారం చేయడానికి కూడా టీడీపీ అభ్యర్థులు భయపడుతున్నారనే ప్రచారం.. మైనస్‌గా మారుతోందని అంటున్నారు. ఇదే సమయంలో మిథున్‌రెడ్డి, తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాబాయ్‌ ద్వారకానాథ్‌రెడ్డి సహకారంతో దూసుకుపోతున్నారు. ఐతే కేంద్ర పథకాలు, మోదీ హవాపై నమ్మకం పెట్టుకున్న బీజేపీ.. రాజంపేటలో పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్‌ చెబుతామంటోంది. మరి ఈ సమ ఉజ్జీల సమరంలో ఎవరు విజయాన్ని అందుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read: చంద్రబాబుకి ఆ పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తోంది: జగన్