గత వైసీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లా, మాచవరం మండలం సరస్వతి పవర్ భూముల వద్దకు చేరుకున్న పవన్ కల్యాణ్ వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.
“ఈ రోజున మన ప్రభుత్వం రాకుంటే, వీరి దోపిడీకి అడ్డుకట్ట పడేది కాదు. కట్టని సిమెంట్ కంపెనీ ఫ్యాక్టరీకి వీళ్లు 190 కోట్ల లీటర్ల పైన నీరు రాసేసుకున్నారు. 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేసి దోచేశారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతాము” అని అన్నారు.
వైఎస్సార్ హయాంలో సరస్వతీ ప్రాజెక్టు తీసుకొచ్చారని, రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని భూములు లాక్కున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. భూములు ఇవ్వబోమన్న వారిపై పెట్రోల్ బాంబులు వేశారని అన్నారు.
ఇన్నేళ్లయినా రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని పవన్ కల్యాణ్ నిలదీశారు. ఈ భూములపై అనుమానాలు ఉండడంతో విచారణకు ఆదేశించామని తెలిపారు. సహజ వనరులను దోచుకున్నారని, అవి ఎవరి సొత్తూ కాదని చెప్పారు. భూములు ఇచ్చిన రైతులకు తాము అండగా ఉంటామని అన్నారు.
KTR: ఆటో డ్రైవర్ల ధర్నాకు ఆటోలో వచ్చిన కేటీఆర్.. అప్పట్లో రాహుల్ గాంధీ కూడా ఆటోలో వచ్చారంటూ విమర్శలు