Pawan Kalyan
మాటలతో కాకుండా చేతలతోనే తమ ప్రభుత్వం పనితనం చూపుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ సంఘాల ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
దేశంలో 70 శాతం ప్రజలు పల్లెల్లోనే ఉంటారని పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామాలను బలోపేతం చేస్తూ గాంధీజీ సిద్ధాంతాలను ముందుకు తీసుకు వెళ్లాలని తమ ఆకాంక్ష అని చెప్పారు. సర్పంచులు ఇచ్చిన 16 డిమాండ్లలో కీలకమైన వాటిని గుర్తించి వాటిని పూర్తి చేశామని తెలిపారు. కేరళలో పని చేస్తున్న అధికారి కృష్ణతేజ ను డిప్యూటేషన్ మీద తీసుకు వచ్చామని, ఆయన సహకారం వల్లే నేడు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని చెప్పారు.
తన పేషీలో ప్రజలకు మేలు చేద్దామనే ఆకాంక్ష ఉన్న అధికారులు ఉండటం తన అదృష్టమని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ ద్వారా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు చేసిన పనులకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని తెలిపారు. ఆ నిధులు విడుదల చేసేందుకు క్యాబినెట్ లో కూడా నిర్ణయించామని చెప్పారు.
పంచాయతీలకు నిధులు ఎక్కువ కావాలని, స్వయం పోషక పంచాయతీలుగా ఎదగాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయా అంశాలను సీఎం, ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ప్రధాని కూడా గ్రామీణాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసేలా చంద్రబాబు నాయకత్వంలో తాము పని చేస్తున్నామని చెప్పారు.
ఐదేళ్ల కాలంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే : విజయసాయి రెడ్డి