దటీజ్ పవన్ కల్యాణ్.. ఆఫీసు ముందే కుర్చీలు వేసుకుని మరీ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న డిప్యూటీ సీఎం

Pawan Kalyan: అక్కడే కూర్చొని బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన దర్బార్ నిర్వహించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రజా సమస్యలు వినేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం బాధితుల సమస్యలను నేరుగా విన్నారు. జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకుని వచ్చిన బాధితులతో ఆయన మాట్లాడారు.

అసెంబ్లీ నుంచి తిరిగి వచ్చిన సమయంలో పవన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వెలుపల బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద ఆగి, అక్కడే కూర్చొని బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చి పంపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఏ విధంగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారో ఇప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు.

బాధితులు చెప్పిన కొన్ని సమస్యలు..

  • కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు  
    విజయవాడలో చదువుకుంటున్న తన మైనర్ కుమార్తెను ప్రేమ పేరిట ట్రాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు పవన్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. తమ కూతురు చదువుకునే విజయవాడ కమిషనరేట్ పరిధిలోనిది కావడంతో మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడంలేదని ఆవేదన చెందింది.

జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని చూపింది. వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు.

  • మాచర్ల నియోజకవర్గం రెంటచింతల ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు జంపయ్యను ఇంటి కోసం సొంత మనవళ్లే వేధిస్తున్నారని, హింసిస్తున్నారని జంపయ్య దంపతులు పవన్ కు విన్నవించుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. అక్కడున్న రెవెన్యూ, పోలీసు అధికారులతో మాట్లాడతామని పవన్ హామీ ఇచ్చారు.
  • కర్నూలు జిల్లాకు చెందిన సువర్ణ తన కుమారుడికి బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు.
  •  జగయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పని చేస్తున్న పాటి నాగరాజు అనే అవుట్ సోర్సింగు ఉద్యోగి తనను రాజకీయ పరమైన కారణాలతో కక్షకట్టి ఉద్యోగం నుంచి తొలగించారని, తనను ఆదుకోవాలని పవన్ కు వినతిపత్రం అందజేశారు.
  • దాదాపు 30 మంది దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారందరితో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Also Read: ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేయనున్న మమతా బెనర్జీ

ట్రెండింగ్ వార్తలు