Pawan Kalyan : ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడింది.. ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడిందని

Jana Sena chief Pawan Kalyan

Pawan Kalyan Letter To PM Modi : ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడిందని ప్రధానికి రాసిన లేఖలో పవన్ ఫిర్యాదు చేశారు. పేదలందరికీ భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని, ఈ స్కీం కింద భారీ ఎత్తున రూ. 35,141 కోట్ల మేర భారీ దోపిడీ జరిగిందని పవన్ అన్నారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పేరుతో జరిగిన దోపిడీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని లేఖలో ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ కోరారు. ఈ స్కీం కేంద్ర ప్రభుత్వ పథకాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని, భూ సేకరణ పేరుతో భారీ భూదందాకు.. భారీ దోపిడీకి వైసీపీ నేతలు తెర లేపారని పవన్ లేఖలో ప్రస్తావించారు.

Also Read : షర్మిలతోనే నా ప్రయాణం.. సీఎం జ‌గ‌న్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బాబుపై నా పోరాటం ఆగదని వెల్లడి

వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టిసారించాలని ప్రధానికి రాసిన లేఖ లో పవన్ కోరారు. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోందని, ఈ అంశంలో అనేక సందేహాలున్నాయని అన్నారు. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసిందని పవన్ లేఖలో పేర్కొన్నారు. మొదట చెప్పినట్లుగా 30లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లే అవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారని, ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందని పవన్ ఆరోపించారు.

పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారని పవన్ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసిందని, పీఎంఏవై, జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారని ప్రధాని మోదీకి లేఖ ద్వారా పవన్ ఫిర్యాదు చేశారు.