Pawan Kalyan : ఇది ఎన్నికల సమయం కాదు, ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం- పవన్ కల్యాణ్

ఇది ఎన్నికల అంశం కాదన్న పవన్.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన సమయం అని అన్నారు. చంద్రబాబు కేవలం మద్దతు తెలపడానికే తన దగ్గరికి వచ్చారని పవన్ తెలిపారు.

Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల సమయం కాదన్న పవన్.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన సమయం అని అన్నారు. అసలు ఎన్నికలు అనేది దృష్టిలో లేవన్న పవన్.. ప్రజాస్వామ్యం బతికితే అప్పుడు కదా ఎన్నికలు అని కామెంట్ చేశారు. ప్రజాస్వామ్యమే ఖూనీ అవుతుంటే, ఇక ఎవరికి చెప్పుకోవాలి అని పవన్ వాపోయారు. ఈ సమయంలో తనకు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపిన చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు పవన్. చంద్రబాబు కేవలం మద్దతు తెలపడానికే తన దగ్గరికి వచ్చారని పవన్ అన్నారు.

”ఏపీలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎన్నికలు దృష్టిలో లేవు. తొలుత ప్రజాస్వామ్యం బతకాలి. అందుకోసం టీడీపీ, ఇతర పార్టీలతో కలిసి కార్యాచరణ ప్రారంభిస్తాం. నాకు మద్దతు తెలిపిన చంద్రబాబుకి కృతజ్ఞతలు. జనసైనికులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు” అని పవన్ అన్నారు.

”అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీల పెద్దలు నాకు మద్దతు తెలిపారు. తెలంగాణ నుంచి జగ్గారెడ్డి, తీన్మార్ మల్లన్న, సీపీఐ రామకృష్ణ నాకు మద్దతు తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రజాస్వామ్యం బతకాలంటే పార్టీలు ఉండాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీలు అడ్రస్ చేయాలి. అలాంటి గొంతే నొక్కేస్తే ఎలా? రాజకీయ పార్టీలను నడిపే వ్యక్తులను నలిపేస్తుంటే ఎలా? అన్ని రాజకీయ పార్టీలు సీపీఐ, సీపీఎం, బీజేపీ, టీడీపీ, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. అడ్డగోలు కేసులతో ఓ పార్టీ అధినేత అయిన నన్నే ఇబ్బంది పెడితే, ఇక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రజలకు భరోసా ఎలా ఇవ్వాలి? వ్యాపారులకు ఎలాంటి భరోసా ఇవ్వాలి? ఆస్తులు దోచేసుకుంటున్నారు. ఇలాంటి అంశాలపై మేము మాట్లాడుకున్నాం. అవసరం అయితే మరోసారి మాట్లాడుకుంటాం. అందరినీ కలుపుకుని వెళ్తాం” అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు