ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను హత్తుకొని కన్నీరుమున్నీరైన జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులు.. వారిని దగ్గర కూర్చొబెట్టుకొని ఓదార్చిన పవన్, లోకేశ్

జవాన్ మురళీనాయక్ పార్ధివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను దగ్గర కూర్చోబెట్టుకొని ఓదార్చారు.

Jawan Murali Naik funeral

Murali Naik: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్ పార్ధివ దేహానికి నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు అమరవీరుడు మురళీ నాయక్ భౌతికకాయాన్ని స్వగ్రామమైన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం మురళీనాయక్ పార్ధివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.

మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సవిత, ఇతర ప్రజాప్రతినిధులు మురళీనాయక్ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. జవాను పార్థివదేహం వద్ద నివాళులర్పించిన లోకేశ్ అనంతరం సెల్యూట్ చేశారు. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. మురళీ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మురళీ నాయక్ పార్థీవదేహానికి నివాళులర్పించారు. పవన్ కల్యాణ్ రావడంతో మురళీనాయక్ తండ్రి శ్రీరాం నాయక్ పవన్ ను హత్తుకొని కన్నీరుమున్నీరయ్యాడు. అనంతరం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మురళి నాయక్ తల్లిదండ్రులను పక్కన కూర్చొబెట్టుకొని ఓదార్చారు. మరికొద్ది సేపట్లో వీరజవాను మురళీ నాయక్ భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.