×
Ad

Pawan Kalyan: “ఆ సమయం ఆసన్నమైంది” అంటూ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్‌

"సనాతనుల భావాలు, ఆచారాలను ఎగతాళి చేయడం లేదా తక్కువ చేసి చూపడం బాధాకరం మాత్రమే కాదు.. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిలోని నమ్మకం, భక్తిని దెబ్బతీస్తుంది" అని అన్నారు. ఇప్పుడు అన్ని వర్గాల అంగీకారంతో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.

Pawan Kalyan

Pawan Kalyan: హిందూ ఆధ్యాత్మిక, నైతిక మూలాలను ఆధారంగా తీసుకున్న శాశ్వత జీవన విధానమే సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సీబీఐ దర్యాప్తులో సంచలన వివరాలు వెలుగుచూశాయని ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన వార్తను పవన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

నకిలీ నెయ్యి తయారీ కేంద్రం బయటపడడం, పాల కొనుగోలు, చెల్లింపుల వివరాలన్నీ తారుమారుచేస్తూ నిందితులు రూపొందించిన నకిలీ రికార్డులని అధికారులు గుర్తించడం వంటి వివరాలు అందులో ఉన్నాయి.

Also Read: నాకు చిన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది.. అప్పటి నుంచి చెక్‌ చేయించుకుంటున్నాను.. ఇప్పుడు..: కొండా విశ్వేశ్వర్ రెడ్డి  

దీనిపై పవన్ స్పందిస్తూ.. “ప్రపంచ హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఓ యాత్రా కేంద్రం కంటే గొప్పది. అది పవిత్ర ఆధ్యాత్మిక ప్రయాణం. తిరుపతి లడ్డూ అంటే అది ఒక తీపి పదార్థం మాత్రమే కాదు.. అందరితోనూ పంచుకునే భావోద్వేగం వంటిది.

మనం దాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులు, పరిచయంలేని వారికి కూడా పంచుతాం. ఎందుకంటే అది మన అందరి విశ్వాసం, భక్తిని ప్రతిబింబిస్తుంది. ప్రతి సంవత్సరం సగటున సుమారు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలకి వస్తారు.

సనాతనుల భావాలు, ఆచారాలను ఎగతాళి చేయడం లేదా తక్కువ చేసి చూపడం బాధాకరం మాత్రమే కాదు.. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిలోని నమ్మకం, భక్తిని దెబ్బతీస్తుంది. లౌకికత్వం రెండు వైపులా ఉండాల్సిందే.. మన నమ్మకాన్ని రక్షించాలా? గౌరవించాలా? అన్న చర్చే ఉండకూడదు. మన సనాతన ధర్మం ప్రపంచంలోని ప్రాచీనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతల్లో ఒకటి. ఇప్పుడు అన్ని వర్గాల అంగీకారంతో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చింది” అని చెప్పారు.