Pawan Kalyan
“ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. గాఢాంధకారం… దారి అంతా గతుకులు… చేతిలో దీపం కూడా లేదు.. కానీ, గుండెల నిండా ధైర్యం ఉంటుంది” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలను 12 ఏళ్ల క్రితం జనసేన ఆవిర్భావ సభలోనూ పవన్ చెప్పిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో 12వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. ఇందులో కూడా పవన్ కల్యాణ్ అదే డైలాగుతో ప్రసంగాన్ని ప్రారంభించారు.
అన్నీ ఒక్కడినై తాను పోరాటం చేశానని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఓడిపోయినప్పటికీ అడుగులు ముందుకే వేశానని తెలిపారు. తాము నిలబడి, పార్టీని నిలబెట్టామని చెప్పారు. అంతేగాక, నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని అన్నారు. తమ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ వెనకడుగు వేయలేదని తెలిపారు.
జనసేన ఓడినప్పుడు కొందరు మీసాలు మెలేశారని, జనసేన కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. జనసేనను అణచివేసేందుకు కుట్రలు చేశారని అన్నారు. అసెంబ్లీ గేటును తాకనివ్వబోమని కొందరు సవాలు విసిరారని అన్నారు. అన్నింటినీ ఎదుర్కొని నిలిచామని తెలిపారు.
భారత్ మొత్తం మనవైపు చూసేలా 100% స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించామని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన జన్మస్థలం తెలంగాణ అని, కర్మస్థానం ఆంధ్రప్రదేశ్ అని పవన్ చెప్పారు.
తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఒక ఉపకరణం మాత్రమేనని పవన్ అన్నారు. సగటు మధ్యతరగతి మనిషిగా జీవించడమే తన కోరిక అని అన్నారు. చంటి మూవీలో మీనాను పెంచినట్టు తనను పెంచారని చెప్పారు. అటువంటి తాను సినిమాల్లోకి వస్తానని, రాజకీయాల్లోకి వస్తానని ఎవరూ ఊహించి ఉండరని తెలిపారు.