JanaSena: వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పవన్ మాట్లాడారు.
చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని చెప్పారు. రాజకీయాల్లో చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం ఉందని అన్నారు. గతంలో కేంద్రంలోనూ గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. చంద్రబాబు నాయుడిపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగిందని అన్నారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు మద్దతు తెలపాలనుకున్నానని చెప్పారు.
జగన్ చేసిన తప్పులకు ఆయనను సోనియా గాంధీ జైల్లో పెట్టించారని పవన్ అన్నారు. ఆ కక్షను జగన్ ఇప్పుడు చంద్రబాబుపై చూపటం అన్యాయమని వ్యాఖ్యానించారు. తాను కష్టాలు చూసిన వాడినని, అనుభవించిన వాడినని చెప్పారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తమలో ఉందని తెలిపారు.