Pawan kalyan
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 20, 21వ తేదీల్లో కాళ్ల మండలం పెద అమిరం నిర్మల ఫంక్షన్ హాలులో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. టీడీపీ ముఖ్య నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశాల్లో పాల్గొంటారు. కాస్మో పాలిటిన్ క్లబ్ వద్ద హెలిపాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కాగా, పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటిస్తారు. రేపు కూడా విశాఖలోనే ఉంటారు. ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ముఖ్యనేతలతో ఆయన వరుసగా భేటీ కానున్నారు. పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొంటారు. పవన్ నోవాటెల్‌లో బస చేస్తారు.
ఇందులోనే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేస్తారు. విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి జనసేన పోటీకి దిగనుంది. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చర్చించారు.
మరోవైపు జనసేన నేత నాగబాబు అనకాపల్లిపై ఫోకస్ పెట్టారు. తన పనులు చకచకా చేసుకుపోతున్నారు. స్థానికేతరుడనే విమర్శలు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా ఎలమంచిలి/అచ్యుతాపురంల్లో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు. ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.