Peela Srinivasa Rao
GVMC: విశాఖ మహానగర పాలక మేయర్ గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన జీవీఎంసీ పాలక వర్గ సమావేశం జరిగింది. కార్పొరేటర్లు, ఎక్స్ అపిషియో సభ్యులు హాజరయ్యారు. కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావును పేరును జనసేన ప్రతిపాదించగా.. బీజేపీ బలపర్చింది. అనంతరం జీవీఎంసీ మేయర్ గా కూటమి అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అనంతరం ధ్రువపత్రం అందజేశారు. మరోవైపు మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది.
విశాఖ మేయర్ గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికపట్ల విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మార్పునకు దోహదపడిన కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తెచ్చి విశాఖను అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు, లోకేశ్ నిరంతరం శ్రమిస్తున్నారని, భవిష్యత్ లో మెట్రో, దిగ్గజ కంపెనీలతో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. తన విజన్ తో విశాఖ సిటీని దేశంలోనే బెస్ట్ సిటీగా మార్చాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని బాలవీరాంజనేయులు తెలిపారు.