bhavya sri death
Chittoor Bhavya Sri Death Case : ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా భవ్య శ్రీ అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవ్యశ్రీ ది ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు గురువారం జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. భవ్య శ్రీ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భవ్యశ్రీ ది ఆత్మహత్యగా నిర్ధారించామని తెలిపారు. భవ్యశ్రీ బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదన్నారు. బాలికపై ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు.
బావిలో దూకడం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు తేలిందన్నారు. మృతదేహం నీళ్లలో కుళ్ళిపోవడం వల్లే బాలిక తల వెంట్రుకలు ఊడిపోయాయని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలో ఇదే అంశాలు నిర్ధారణ అయ్యాయని పేర్కొన్నారు. కర్నూలు ఫోరెన్సిక్ నిపుణుల దగ్గర నుంచి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నామని వెల్లడించారు. చనిపోయిన సమయంలో భవ్య శ్రీ ఒంటిపై లోదుస్తులు లేవని తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. భవ్య శ్రీ ది హత్య కాదు… తాను ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు.
బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా విచారిస్తున్నామని తెలిపారు. భవ్య శ్రీ బావిలో దూకి చనిపోవడానికి కొన్ని గంటల ముందు తల్లితో గొడవ పడిందన్నారు. ఇదే విషయాన్ని తల్లి తాను పని చేస్తున్న చోట కొందరు మహిళలకు సైతం చెప్పిన్నట్లు పేర్కొన్నారు.మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అనేక కోణాల్లో విచారించామని తెలిపారు.
భవ్య శ్రీ మృతిపై అనేక పుకార్లు సృష్టించారని తెలిపారు. నలుగురు యువకులతో పాటు పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించామని వెల్లడించారు. వేలాది ఫోన్ కాల్స్ ట్రేస్ చేశామని చెప్పారు. ఎవరిపైనా ఆరోపణలు రుజువు కాలేదన్నారు. మృతురాలు తల్లితో ఎందుకు గొడవ పడింది..?, ఆత్మహత్యకు తనను ఎవరన్నా ప్రేరేపించారన్న కోణంలో విచారిస్తున్నామని వెల్లడించారు.