Medicines Price
Medicines Price : దేశవ్యాప్తంగా జీఎస్టీ రేటు తగ్గించిన తరువాత ప్రభుత్వం ఇప్పుడు ఔషధ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాలపై, ఔషధ ఇన్‌పుట్‌లపై కనీస దిగుమతి ధర (MIP) విధించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అమలైతే దేశంలో పలు రకాల ఔషధాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల యాక్టీవ్ ఫార్మా స్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీ దారుల ఖర్చు పెరిగి.. మందుల ధరలు పెరిగే పరిస్థితి వస్తుందని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు.
భారత ఔషధ పరిశ్రమ ముడి పదార్థాల కోసం ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. అయితే, చైనా నుంచి ముడి పదార్థాల దిగుమతిని తగ్గించి, దేశీయ ఉత్పత్తిదారుల మనుగడకు భరోసా కల్పించడానికి ఎంఐపీని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దేశీయ కంపెనీలు అవసరమైన ముడి పదార్థాల ఉత్పత్తిలో పెట్టుబడులను పెంచడానికి ప్రోత్సహించడానికి 2020లో ప్రభుత్వం ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని ప్రారంభించింది.
ఇదిలాఉంటే.. కేంద్రం తాజా ప్రతిపాదనతో చైనా, ఇతర దేశాల నుంచి ముడి పదార్థాల దిగుమతులను పెద్దెత్తున తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, చాలా మంది వైద్య నిపుణులు ఈ చర్యను భారత ఔషధ రంగానికి హానికరమని పేర్కొంటున్నారు.
ప్రభుత్వం ప్రస్తుతం పెన్సిలిన్ జి, 6ఏపీఏ, అమోక్సిసిలిన్ లాంటి వాటికి ఎంఐపీని నిర్ణయించాలని యోచిస్తోంది. దీని వల్ల ఈ రంగంలోని 10వేలకుపైగా ఎస్ఎంఈలు మూతపడే అవకాశం ఉందని, రెండు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అమాక్సిలిన్ ను ఎంఐపీలో చేర్చడం వల్ల ప్రభుత్వ టెండర్ సరఫరా విభాగంలో దేశీయ మందుల ధరలు 40శాతం పెరుగుతాయని పలువురు పేర్కొంటున్నారు.