Annadata Sukhibhava Scheme: కూటమి ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద ఆగస్టు 2వ తేదీన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడత రూ.7వేలు జమ చేయనున్నారు. ఇప్పటికే అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు.
ఆగస్టు 2న ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తన చేతులమీదుగా పీఎం కిసాన్ 20వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఆ వెంటనే ఏపీలోని రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన తొలి విడత నిధులు జమ అవుతాయి.
కూటమి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను గుర్తించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు కార్యాచరణ చేపట్టింది. రైతులకు అండగా నిలిచేలా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతీయేటా రూ.20వేలు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.6వేలకుతోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు కలిపి ఇవ్వనుంది. వీటిని మూడు విడుతల్లో అందజేస్తుంది.
వ్యవసాయశాఖ వెబ్ ల్యాండ్ ఆధారంగా రైతుల జాబితాలను ఖరారు చేసి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అర్హుల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతర పనులకు భూమిని వినియోగించే వారిని మినహాయించి మిగిలిన అందరినీ ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు రైతులతో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయించారు.
అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో జమ అవ్వాలంటే రైతులు ముందుగా ఒక పని చెయ్యాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఈ పథకం కింద లబ్ధిదారుల పేర్లను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచింది. అందువల్ల లబ్ధిదారులైన రైతులు, సచివాలయానికి వెళ్లి అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పేరు ఉంటే ఇక మనీ కచ్చితంగా మీ ఖాతాల్లో జమ అవుతుంది.
జాబితాలో మీ పేరు లేదంటే.. దాని అర్థం ఆ రైతులు ఈ-కేవైసీ, బయోమెట్రిక్ పూర్తి చేయలేదని భావించాలి. వెంటనే అధికారులను సంప్రదించి రైతులు ఆ పనిని పూర్తి చేయించుకోవాలి. ఇందుకోసం రైతులు సచివాలయంలో వివరాలు కోరవచ్చు. సచివాలయ ఉద్యోగులు స్వయంగా ఈ-కేవైసీ చేయించగలరు. లేదా.. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in లోకి వెళ్లి.. అక్కడ కూడా చేయించుకోవచ్చు. అలాగే.. ఈ వెబ్‌సైట్‌లో కుడివైపు పైన మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని మొబైల్ లోకి డౌన్‌లోడ్ చేసుకొని కూడా ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. లేదా మీ-సేవా కేంద్రంలో చేయించుకోవచ్చు.