Cyber Fraud
Cyber Fraud : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్తకొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వారి మోసాల జాబితాలో అమాయకులతోపాటు ఉన్నతవిద్యావంతులు కూడా ఉంటుండటం ఆందోళనకు గురిచేస్తోంది. డబ్బుల ఆశతో సైబర్ నేరగాళ్ల వలలోపడి లక్షలు, కోట్లాది రూపాయలు పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే, తాజాగా సంక్రాంతి సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో లింక్‌తో కూడిన మెస్సేజ్ లు వస్తున్నాయి. పొరపాటున ఆ లింక్ నొక్కితే మీ అకౌంట్లో డబ్బులు మాయమైనట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read : US Strikes : వెనెజువెలా తరహాలో దాడికి అమెరికా సన్నాహాలు..? ఇరాన్ వైపు అమెరికా యుద్ధనౌకలు..
సంక్రాంతి సందర్భంగా ఫోన్ పే పేరుతో సామాజిక మాధ్యమాల్లో లింక్‌తో ఓ మెస్సేజ్ వస్తుంది. అందులో.. ‘మొదట ఇది నకిలీ అనుకున్నాను. కానీ, నిజంగా నాకు రూ.5వేలు వచ్చింది. మీరు కూడా ప్రయత్నించి చూడండి’ అంటూ అందులో రాసిఉంటుంది. డబ్బులు వస్తాయని ఎవరైనా ఆ లింక్ నొక్కితే ఇబ్బందులు తప్పవని, ఇలాంటి లింక్ లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు ఇలాంటి లింక్‌లను సృష్టించి పంపిస్తున్నారు. ఈ లింక్‌లపై ఎవరైనా నొక్కితే వారి ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత మీ అకౌంట్లలో డబ్బులు పోయే ఆస్కారం కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లింక్ మీకు ఫార్వార్డ్ చేసినా వాటిని నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు పండుగ పూట బహుమతులు అంటూ లింక్ లు పంపిస్తున్నారని, అలాంటి వాటిపై క్లిక్ చేయొద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.