టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్టు

Police arrests TDP leader Kala Venkatrao : టీడీపీ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని క్యాంపు ఆఫీస్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థంలో విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో వెంకట్రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కాసేపటి క్రితమే ఆయనను అరెస్టు చేశారు.

నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు కళా వెంకట్రావును తరలించారు. రాజాంలో భారీగా పోలీసులు మోహరించారు. కళా వెంకట్రావు అరెస్టును నారా లోకేష్ ఖండించారు. బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

రామతీర్థంలో కొండపైకి వెళ్తున్న క్రమంలో విజయశాయిరెడ్డిపై చెప్పుల దాడి జరిగింది. ఈ చెప్పుల దాడి ఘటనకు కారణం మాజీ మంత్రి కళా వెంకట్రావు అని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్థానిక పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం లేకుండా విజయనగరం నుంచి నేరుగా పోలీసులు వచ్చి కళా వెంకట్రావును అరెస్టు చేశారు.

అరెస్టు చేసే సమయంలో మీడియా, సన్నిహితులతో కళా వెంకట్రావు మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. అక్రమ కేసులు బనాయించి తనను అరెస్టు చేస్తున్నారని మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికి కూడా పోలీసులు అయన్ను పోలీసు వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లారు. నెల్లిమర్ల పీఎస్ కు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.