Rahul Murder Case : రాహుల్ హత్య కేసు..పోలీసుల అదుపులో కోరాడ విజయ్ కుమార్ డ్రైవర్

బెజవాడ రాహుల్‌ మర్డర్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితుడు కోరాడ విజయ్‌కుమార్‌ డ్రైవర్‌... బాబును అదుపులోకి తీసుకున్నారు.

Rahul Murder Case

Rahul murder case : బెజవాడ రాహుల్‌ మర్డర్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కోరాడ విజయ్‌కుమార్‌ డ్రైవర్‌… బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బాబును అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ హత్య జరిగిన రాత్రి నుంచి కారు డ్రైవర్‌ బాబు పరారీలో ఉన్నాడు. డ్రైవర్‌పై నిఘా పెట్టిన పోలీసులు.. ఇవాళ అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ మర్డర్‌పై బాబును విచారిస్తున్నారు.

రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ2గా కోగంటి సత్యం పేర్లు చేర్చారు. ముగ్గురు మహిళల ప్రేమేయం కూడా రాహుల్ హత్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్యతో పాత్రధారులుగా భావిస్తున్న పద్మజ అనే పేరుతో ఉన్న ఇద్దరు మహిళల పేర్లను కూడా ఏ3, ఏ4గా చేర్చారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలుకు చర్చలు జరిగాయని… తన వాటా డబ్బుల కోసం కోరాడ విజయ్‌కుమార్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు..

ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోనే పారిశ్రామికవేత్త రాహుల్‌ను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. నిందితుల కాల్‌ డేటా దర్యాప్తులో కీలకంగా మారింది. కాల్‌డేటాను విశ్లేషిస్తూనే మరోవైపు నిందితుడిగా అనుమానిస్తున్న విజయ్‌కుమార్‌ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం బెంగళూరులో గాలింపు కొనసాగిస్తుంది. అటు రాహుల్‌ను హతమార్చేందుకు సుపారీ కిల్లర్‌తో హత్యకు ప్లాన్ చేసినట్లు సమాచారం. నిందితులు ముగ్గురు లేదా నలుగురు ఉండవచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు. వారిని విచారిస్తేనే అసలు విషయాలు బయటపడుతాయని చెబుతున్నారు.