Posani Krishna Murali
Posani Krishna Murali Complaint : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని పోసాని కృష్ణమురళి కలిసి ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్నట్టు సమాచారం ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. డీజీపీని కలిసి తనకు లోకేష్ నుంచి ఉన్న ప్రమాదాన్ని వివరించానని పోసాని తెలిపారు. తన భద్రతకు డీజీపీ హామీ ఇచ్చారని, రక్షణ కల్పిస్తామని చెప్పారని పేర్కొన్నారు. తనకు సెక్యూరిటీ పెంచమని అడుగలేదని చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం మంగళగిరిలో మీడియాతో మాట్లడారు.
టీడీపీలోకి తనను చేర్చుకోవాలని లోకేష్ ప్రయత్నించారని, పీఏ చైతన్య ద్వారా కలిసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరనని చెప్పడంతో తనపై కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. లోకేష్ గురించి తాను గట్టిగా చెబుతాను కాబట్టే తనను లేపేయాలని అనుకున్నాడని పేర్కొన్నారు. తాను అగ్రెసివ్ గా మాట్లాడతాను కాబట్టి తనను చంపాలనుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్ తనపై హత్యాయత్నం చేసే అవకాశం ఉందని తన శ్రేయోభిలాషులు చెప్పారని తెలిపారు.
లోకేష్ బండారం మొత్తం బయట పెట్టింది తానేనని పేర్కొన్నారు. లోకేష్ అందరినీ బట్టలు విప్పి కొడతా అంటున్నారు.. ఎన్నిసార్లు, ఎంతమంది బట్టలూడదీస్తావు అని ప్రశ్నించారు. లోకేష్ ప్రజలకు ఏం చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి వద్దు.. ప్రజలు ముఖ్యమని చంద్రబాబు చెబుతాడా అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ లో ఉన్నపుడు మామయ్య నన్ను పార్టీలో చేర్చుకో నాకు ఏమీ వద్దని ఎన్టీఆర్ తో చంద్రబాబు చెప్పారు’ అని పోసాని తెలిపారు. ఎన్టీఆర్ కు చెప్పే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారా అని నిలదీశారు.
కాంగ్రెస్ ఒడిపోగానే చంద్రబాబు టీడీపీలో చేరి ఎన్టీఆర్ పక్కన చేరారని చెప్పారు. ఎన్టీఆర్ కే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి ఇష్టం లేకపోతే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు తన కుటుంబ సభ్యుసతో కలిసి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. జగన్ అంటే తనను ప్రాణం.. 13 సంవత్సరాల నుండి ఆయనతోనే ఉన్నానని తెలిపారు. తాను సినిమా వాడిని కాబట్టి ఎఫ్డిసి ఛైర్మెన్ పదని ఇచ్చారని, తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొన్నారు.