కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
“మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. ఆ మాటలకు సభ్య సమాజం సిగ్గుపడుతుంది.
వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయి. అధికారంలో ఉన్నప్పుడూ ఆ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు.
నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో… ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారు. అయినప్పటికీ వదరుబోతు మాటలు వదల్లేకపోతున్నారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుంది” అని పవన్ కల్యాణ్ అన్నారు.
పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదు: లోకేశ్
వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా? అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. “పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదు. కనీస ఇంగితజ్ఞానం ఉండాలి. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణం. తల్లి, చెల్లిని తరిమేసిన అధినేత జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. మహిళల జోలికి వచ్చినా, ఆడవారిపై అవాకులు, చవాకులు పేలినా ఊరుకునేందుకు ఇది జగన్ జంగిల్ రాజ్ కాదు.. మహిళలకు అండగా నిలిచే ప్రజాప్రభుత్వం” అని చెప్పారు.