Prashant Kishor: ఎన్నికల వేళ విజయవాడకు ‘వ్యూహకర్త’ ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుతో భేటీ

గత ఏపీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వైసీపీ తరఫున పనిచేశారు. ఇప్పుడేమో...

Prashant Kishor-Chandrababu Naidu

Prashant Kishor: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయవాడకు వచ్చారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్‌ గ్రీన్‌ పవర్‌ అండ్‌ ఎవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రైవేట్ జెట్లో ప్రశాంత్ కిశోర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలిసి గన్నవరం వచ్చారు.

తర్వాత వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పీకే పనిచేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ విషయంపై గత కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబుతో పీకే భేటీ అవడంతో ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు మారాయి.

టీడీపీ నేత నారా లోకేశ్ శనివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు చెబుతారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీలో ప్రశాంత్ కిశోర్‌తో నారా లోకేశ్ సమావేశమయ్యారు. వీరిద్దరు ఎన్నికలపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున..

గత ఏపీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వైసీపీ తరఫున పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. అప్పట్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ సారి జనసేనతో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసింది.

కాగా, ఏపీలో ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచించుకుంటున్నాయి. ఏయే సీట్లను ఎవరికి కేటాయించాలన్న విషయంపై నిమగ్నమయ్యాయి. సర్వేల ఆధారంగా కొన్ని పార్టీలు టికెట్ల కేటాయింపు, సీట్ల మార్పులపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఇద్దరు పీకేల భేటీ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా ప్రశాంత్ కిశోర్ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎంట్రీతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సేవలను పూర్తిగా వినియోగించుకోవడానికి టీడీపీ సిద్ధమవుతోంది. టీడీపీ బలాలు, బలహీనతలపై నివేదిక సిద్ధం చేసి చంద్రబాబుకి ఇచ్చారు పీకే. వైసీపీ మైనస్ పాయింట్ల గురించి కూడా నివేదిక ఇచ్చారు. 2024 ఎన్నికల్లో గెలవడానికి పీకే కార్యాచరణ రూపొందించారు.

 

AP High Court: చంద్రబాబు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు