Prashant kishore
Prashant kishore’s comments on NTR : టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గురించి మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్‌సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ (Prashant kishore) కీలక కామెంట్స్ చేశారు. భారతదేశంలో ప్రజలకు ఉపయోగపడేలా సరికొత్త రాజకీయాలకు నాంది పలికిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
సినీ పరిశ్రమ నుంచి వచ్చినప్పటికీ భారత దేశం రాజకీయాలను పున:నిర్మించినందుకు ఆయన్ను ఎంతగానో ప్రశంసించాల్సిందేనని అన్నారు. రథాలు, యాత్రల భావనను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఆయన ఒక పెద్ద సవాలుగా మారారని కిశోర్ అన్నారు. ఎన్టీఆర్ మొదటి నుంచి రాజకీయ నాయకుడు కాకపోయినప్పటికీ.. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇందిరాగాంధీని ఓడించి చరిత్ర సృష్టించారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఇదే తరహాలోనే అస్సాంకు చెందిన ప్రపుల్ల కుమార్ మహంత కూడా ఆయన సారూపత్యను చూపించారని, ఆయన కూడా ఇలాంటి అబివృద్ధి సాధించారని అన్నారు.
నేటితరం ప్రధాని నరేంద్ర మోదీ లేదా అరవింద్ కేజ్రీవాల్ తోనే రాజకీయ ఆవిష్కరణలు ప్రారంభమయ్యాయని అనుకుంటారని, కానీ, చరిత్ర వేరే కథ చెబుతుందని పేర్కొంటూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత సీఎం ఎన్టీఆర్ గురించి ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.
Also Read: Hyderabad: హైదరాబాద్ భూముల వేలంలో సరికొత్త రికార్డు.. ఎకరం రూ.177 కోట్లు!.. ఏ ప్రాంతంలో అంటే..
ఇదిలాఉంటే.. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశాంత్ కిశోర్ విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని రక్షించలేరని పీకే అన్నారు. బిహార్ ప్రజలను రేవంత్ రెడ్డి గతంలో అవమానించారని ప్రకాశ్ కిశోర్ అన్నారు. రేవంత్ రెడ్డి పలుసార్లు ఢిల్లీలో మమ్మల్ని కలిశారు. తెలంగాణకు సంబంధించిన విషయంలో సాయం అడిగారు. నేను సాయం చేయలేదు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక, బిహారీలను అవమానించేంత అహంకారిగా మారారు. నేను బిహార్‌కి చెందిన వ్యక్తిని. మా డీఎన్ఏ తక్కువైతే, మా సాయం ఎందుకు కోరారు? మేము తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డిని ఓడిస్తాం” అని వ్యాఖ్యానించారు.
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రశాంత్ కిశోర్ ఒక పొలిటికల్ బ్రోకర్ అని, భ్రమల్లో బతికే విఫల రాజకీయ నాయకుడని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్, మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తనను మించిన తెలివి గలవారు దేశంలోనే లేరనే భ్రమతో పీకే రాజకీయ విశ్లేషణలు చేస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, ప్రశాంత్ కిశోర్ జేజమ్మ దిగివచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.