నిమ్మగడ్డ రమేష్ వ్యవహారాన్ని సాగదీయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వానిది: ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

  • Publish Date - July 23, 2020 / 03:09 PM IST

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుని పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వానికి చెప్పారు. అయినా దీనిపై అనిశ్చితి కొనసాగుతోంది. జగన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు ఈ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించనుంది? సీఎం జగన్ మనసులో ఏముంది? నిమ్మగడ్డను ఎస్ఈసీగా కొనసాగిస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది. ఈ వ్యవహారంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ స్పందించారు.

గవర్నర్ ఆదేశించారు తప్ప చొరవ చూపలేదు:
టెన్ టీవీ డిబెట్ లో పాల్గొన్న ప్రొ.నాగేశ్వర్ కీలక విషయాలు ప్రస్తావించారు. ఏపీలో మరో సమస్య లేనట్టు నిమ్మగడ్డ వ్యవహారంపై దృష్టి పెడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుని పరిశీలించాలని మాత్రమే గవర్నర్ బిశ్వభూషణ్ జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు తప్ప, స్వయంగా చొరవ చూపి ప్రభుత్వంతో మాట్లాడింది లేదని నాగేశ్వర్ చెప్పారు. నిమ్మగడ్డ సమస్యపై సీఎం జగన్ ను పిలిచి గవర్నర్ మాట్లాడాల్సింది, కానీ ఆయన అలా చేయలేదు అని అన్నారు. కాగా, నిమ్మగడ్డ వ్యవహారాన్ని పొడిగించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఈ వ్యవహారాన్ని ఇలానే సాగదీయాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని నాగేశ్వర్ విశ్లేషించారు.

నిమ్మగడ్డ రమేష్ రిటైర్ అయ్యేదాకా సాగదీయాలని ప్రభుత్వం చూస్తోంది:
”గవర్నర్ చాలా క్యాజువల్ గా చెప్పినట్టుగా ఉంది. హైకోర్టు తీర్పు చాలా క్లియర్ గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరో మార్గం లేదు. ప్రభుత్వాన్ని ఆదేశించడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది. ఎలాగైనా అంశాన్ని సాగదీయాలని చూస్తోంది. నిమ్మగడ్డ రమేష్ రిటైర్ అయ్యే దాకా సాగదీయాలని ప్రభుత్వం చూస్తోంది. న్యాయ, ప్రజాస్వామ్య వ్యస్థలలో సహజ ఆలస్యాలు(natural delays)ను ప్రభుత్వం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది.”

ప్రభుత్వంతో స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం గవర్నర్ చెయ్యలేదు:
”హైకోర్టు ఆదేశాలను పరిశీలించి, ఆ ఆదేశాల్లో ఏం చెప్పారో అర్థం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటం ఒక పద్ధతి. రెండోది ఏంటంటే, తనకు ఏమీ సంబంధం లేన్నట్టుగా హైకోర్టు తీర్పుని చదవకుండా వదిలేయడం. హైకోర్టు తీర్పుకి అనుగుణంగా వ్యవహరించండి అని మాత్రమే గవర్నర్ చెప్పారు. అంతేకానీ గర్నవర్ చొరవ తీసుకుని, ప్రభుత్వంతో మాట్లాడి, సమస్యను పరిష్కరించండి అని చెప్పలేదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. గవర్నర్ ఒక ఆర్డర్ ఇస్తారు. నార్మల ప్రొసీజర్ ఏంటో, దాన్ని గవర్నర్ చేశారు అంతే. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ వ్యవహారాన్ని పరిశీలించండి అని ప్రభుత్వానికి చెప్పారు. రూల్స్ ప్రకారం వెళ్లమని చెప్పడం ఒక పద్దతి.. రూల్స్ ఇవీ, ఇలాగే చెయ్యాలి అని చెప్పడం మరో పద్దతి. సాంకేతికంగా ఫార్మల్ గా గవర్నర్ రెస్పాండ్ అయ్యారు అంతే. నిమ్మగడ్డ వచ్చి అభ్యర్థన చేస్తేనే గవర్నర్ స్పందించారు తప్ప, గవర్నర్ స్వయంగా చొరవ తీసుకుని స్పందించ లేదు” అని ప్రొ.నాగేశ్వర్ అన్నారు.

ఇంతకన్నా మేము ఏమీ చేయలేము. నువ్వు వెళ్లి గవర్నర్ ని కలువు. గవర్నర్ ఇస్తే తీసుకో, లేదంటే ఊరుకో అని హైకోర్టు అనలేదు కదా. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు పాటించకపోవడం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుంది. కోర్టు ఆదేశాలు మిస్ ప్రజెంట్ చేయడం కూడా కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది. ఈ వ్యవహారంలో గవర్నర్ తీరు తప్పించుకున్న విధంగా ఉంది. ఇందులో రాజ్ భవన్ తప్పు లేదు.

నిమ్మగడ్డ ప్రవర్తనా శైలి గురించి ప్రభుత్వం హైకోర్టులో ఎందుకు ప్రస్తావించడం లేదు?
నిమ్మగడ్డ రమేష్ వ్యవహారశైలి కరెక్ట్ కాదు. అందులో అనుమానం లేదు. పార్క్ హయత్ హోటల్ లో ఆయన బీజేపీ నేతలను కలవడం తప్పు. ఆయన హోంమంత్రి దగ్గర కాన్ఫిడెన్షియల్ లెటర్ ను పెట్టడం తప్పు. సీఎం సంబోధించడం తప్పు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫ్యాక్షనిస్టుగా సంబోధించడం తప్పు. కులం పేరుతో నిమ్మగడ్డను సీఎం జగన్ దూషించడం కూడా తప్పే. మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడటం కూడా తప్పే. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని తన కులం కోసం ఇలా చేశారని అనడం ముఖ్యమంత్రి పదవికి గౌరవాన్ని ఇవ్వదు. హైకోర్టుకి వెళితే ఇవన్నీ బటయపడతాయి. అందుకే ఏపీ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్లడం లేదు. తన వాదనలో నిజాయితీ ఉంటే ప్రభుత్వం హైకోర్టులో మరోసారి రివ్యూ పిటిషన్ వేయాల్సింది. నిమ్మగడ్డ రమేష్ ప్రవర్తన రిత్యా మీరు గతంలో ఇచ్చిన తీర్పుని పునరాలోచించండి అని హైకోర్టుని అడగాల్సింది. కానీ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్లలేదు. ఎందుకు వెళ్ల లేదు. పోనీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో అయినా నిమ్మగడ్డ తాజా ప్రవర్తనా సరళి గురించి ప్రభుత్వం ఎక్కడైనా ప్రస్తావించిందా? కోర్టులో పిటిషన్ కు యాడ్ చేయొచ్చు. కానీ ప్రభుత్వం అలా చెయ్యలేదు.

జగన్ పోరాడాల్సింది చంద్రబాబుతో.. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితా రాణి, రంగనాయకమ్మలతో కాదు:
జగన్ పోరాడాల్సింది చంద్రబాబుతో. నిమ్మగడ్డతోనో, డాక్టర్ సుధాకర్ తోనో, డాక్టర్ అనితా రాణితోనో, రంగనాయకమ్మతోనో కాదు. పోరాడాల్సింది రాజకీయ ప్రత్యర్థులతో. ఇవాళ ఏపీలో ప్రతిపక్ష నాయకులు ఎవరు అని నన్ను అడిగితే, చంద్రబాబు కాదు కన్నా లక్ష్మీనారాయణ కాదు..రంగనాయకమ్మ, రామక్రిష్ణ, అనితా రాణి, డాక్టర్ సుధాకర్ అని చెబుతా. వీళ్లా ప్రతిపక్ష నాయకులు? జగన్ వర్సెస్ డాక్టర్ సుధాకర్, జగన్ వర్సెస్ అనితారాణి.. ఇవి కాదు కదా. ఈ వ్యవహారాలను రాష్ట్రంలో పెద్ద రాజకీయ వివాద స్థాయికి ఎస్కలేట్ చేయాల్సిన అవసరం లేదు. స్థానిక పోలీసులు, కోర్టులు పట్టించుకోవాల్సిన విషయాలను రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ వివాదంగా ఎందుకు మార్చుకుంటున్నారు. దీని వల్ల రాజకీయంగా ఏ ప్రయోజనం ఉండదు. రాజకీయంగా ప్రత్యర్థులతో పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది తప్ప, అందరితో పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు. అందరితోనూ అలానే వివాదం పెట్టుకుంటాము అంటే చేయగలిగింది ఏమీ లేదు. నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వనంత కాలం హైకోర్టు తీర్పు చెల్లుతుంది.” అని ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు.