Site icon 10TV Telugu

పులివెందులలో హీటెక్కిన పాలిటిక్స్.. జెడ్పిటీసీ ఉపఎన్నిక బరిలోకి టీడీపీ.. నామినేషన్లు దాఖలు

Pulivendula Zptc By Election

Pulivendula Zptc By Election

Pulivendula ZPTC Elections : పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. బరిలో నిలిచేందుకు అధికార పార్టీ అయిన టీడీపీసైతం సిద్ధమైంది. గత సంప్రదాయాన్ని పక్కనపెట్టి పోటీకి దిగేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఈ ఎన్నికను స్థానిక నాయకత్వం ఛాలెంజ్‌గా తీసుకుంది. దీంతో పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి, ఆయన సోదరుడు మారెడ్డి జయ భరత్ రెడ్డి ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. ఈనెల 12వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. 14వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

నామినేషన్లకు చివరిరోజు కావడంతో మారెడ్డి లతారెడ్డి, మారెడ్డి జయ భరత్ రెడ్డిలు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ తరపున ఈ స్థానానికి నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. దీంతో గురువారం తుమ్మల హేమంత్ రెడ్డి, తుమ్మల ఉమాదేవిలు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

చంద్రబాబుకు కానుకగా ఇస్తాం.. బీటెక్ రవి
పులివెందుల టీడీపీ ఇంచార్జి బిటెక్ రవి మాట్లాడుతూ.. అధిష్టానం అనుమతితో ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తున్నామని చెప్పారు. మారెడ్డి లతారెడ్డి, జయభరత్ కుమార్ రెడ్డిని పోటీలో పెడుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన తరువాత మండలంలోని అందరితో కలిసి సమావేశం నిర్వహిస్తామని, చంద్రబాబుకు కానుకగా పులివెందుల జడ్పీటీసీని ఇస్తామని అన్నారు. కొత్తపల్లికి చెందిన పుష్పనాథ్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరబోతున్నారని, గతంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పుష్పనాథ్ రెడ్డి పనిచేశారని బీటెక్ రవి తెలిపారు.

అందరిలోనూ ఆసక్తి..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం.. మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండడం.. మరో 14 నెలల్లో ప్రస్తుత జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియనుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 

Exit mobile version