×
Ad

Rain Alert : దూసుకొస్తున్న తుపాను.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..

Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే అయిదు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rain Alert

Rain Alert : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతుండగా.. తాజాగా.. మరో తుపాను రాష్ట్రాన్ని తాకనుంది. ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది శనివారానికి వాయుగుండంగా మారుతుందని, 26వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని, 27వ తేదీ ఉదయానికి నైరుతి, పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది తుపానుగా మారితే ‘మొంథా’గా ఐఎండీ నామకరణం చేయనుంది. దీన్ని థాయిలాండ్ సూచించింది.

Also Read: Karthika Masam: కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే.. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు తిరుగులేదంతే..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే అయిదు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇవాళ (శనివారం) కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

రేపు (ఆదివారం) గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో ప్రజలు బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలోనూ, ఈదురు గాలుల సమయంలో చెట్ల కింద, హోర్డింగ్ లు ఉన్న ప్రదేశాలు, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని, వర్షం పడే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.