Heavy Rains (Photo : Google)
Andhra Pradesh Rain : ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఓవైపు ఉక్కపోత, మరోవైపు వడగాల్పులు.. దెబ్బకు జనం విలవిలలాడిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్ లో సూర్యుడు మంటలు పుట్టిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఇలాంటి హాట్ హాట్ సిట్యుయేషన్ లో.. మండుతున్న ఎండల నుంచి కాస్త రిలీఫ్ లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది.
Also Read..climate update: ఇవేం ఎండలు రా బాబూ.. మే నెల ముగిసినా ఎండలు తగ్గవట!
బెజవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గడిచిన నాలుగు రోజులుగా భానుడు తీవ్ర ప్రతాపం చూపాడు. ఉక్కపోత, వడగాల్పులతో నగరవాసులు అల్లాడిపోయారు. ఇలాంటి సమయంలో వాన పడటంతో వాతావరణం చల్లబడి మండుటెండల నుంచి జనాలు ఉపశమనం పొందారు. చల్లని వాతావరణంలో సేదతీరారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. క్రోసూరు మండలం అనంతవరం గ్రామంలో రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఉరుములు, మెరుపులలో కూడిన వర్షంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్థంభాలు కూలాయి. దాంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఇక.. అల్లూరి, మన్యం, రాజమహేంద్రవరం, కాకినాడలోనూ వర్షాలు పడ్డాయి.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారులోని కణేకల్లు రోడ్డులో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం సాయంత్రం ఎం.హనుమాపురానికి చెందిన నారాయణ రెడ్డి, జక్కలవడికికి చెందిన వెంకటేశులు, బలరాం, కొంతనపల్లికి చెందిన మరో వ్యక్తి చెట్టు కింద ఉండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు పడటంతో నారాయణరెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. వెంకటేశులు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వాన పడింది. నాగర్ కర్నూలు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వెంకటాపూర్ శివారులో పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది.
రాష్ట్రంలో రేపటి(మే 21) నుంచి 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది. హైదరాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, వనపర్తి, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.