AP Liquor Scam: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

కసిరెడ్డి ఇవాళ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రాజ్ కసిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మద్యం కుంభకోణంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌తో కలసి పనిచేసిన కసిరెడ్డి అనంతరం వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా వ్యవహరించారు.

కసిరెడ్డి ఇవాళ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎయిర్‌పోర్టు వద్దే ఉండి మరీ కసిరెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. రేపు విచారణకు హాజరవుతానని సిట్‌కి కసిరెడ్డి సమాచారం అందించారు. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల లిక్కర్ అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ఆరోపించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక లిక్కర్ స్కాంపై స్కాన్ చేయాల్సిందే అంటూ విచారణకు ఆదేశాలు వచ్చాయి.

వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన విజయ సాయిరెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన తర్వాత లిక్కర్ స్కాంలో కర్మ, కర్త, క్రియ అంతా కసిరెడ్డి అంటూ ఆరోపించారు. కసిరెడ్డిపాత్రపై ఫోకస్ పెట్టి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కసిరెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలోనే అక్కడ లిక్కర్ బిజినెస్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

Also Read: అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.79.. ఇప్పుడు రూ.లక్ష.. బంగారం ధరలు పెరిగిన తీరు ఇది..