×
Ad

‘శబరిమల’ వెళ్లలేకపోతున్నానని బాధపడుతున్నారా? మన గోదావరి తీరాన ‘శబరిమల’ వంటి అయ్యప్ప ఆలయం.. ఆధ్యాత్మిక పరిమళాలు..

"శ్రీ ధర్మ శాస్తా ఆధ్యాత్మిక కేంద్రం" అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. మణికంఠుడి నామంతో ఇక్కడి పరిసరాలు మార్మోగుతాయి.

Rajahmundry Ayyappa Temple: అయ్యప్ప స్వామి పేరు వినగానే మనకు శబరిమల గుర్తుకువస్తుంది. శబరిమల వరకు వెళ్లి స్వామివారిని సందర్శించుకోలేకపోతున్న భక్తుల కోసం గోదావరి నది తీరం రాజమండ్రిలో ప్రత్యేకంగా నిర్మించిన అయ్యప్ప ఆలయం ఉంది. శబరిమల ఆలయానికి ఏ మాత్రం తీసిపోకుండా మణికంఠుడికి ఇక్కడ ప్రతిరోజూ ధూప దీప నైవేద్యాలతో పూజలు శోభాయమానంగా జరుగుతాయి.

ఈ దేవాలయాన్ని 2011, మార్చి 20న నిర్మించారు. కోటప్పకొండ నుంచి శిలలు తీసుకొచ్చి, పంచ లోహాలతో అయ్యప్ప స్వామి మూల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయ్యప్ప మాల ధరించే భక్తులు సాధారణంగా ఇరుముడి ధరించి శబరిమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే, రాజమండ్రిలోని ఈ ఆలయంలోనూ భక్తులు ఇరుముడి స‌మ‌ర్పించుకోవచ్చు. (Rajahmundry Ayyappa Temple)

శబరిమలలాగే ఈ ఆలయంలో అనేక ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయి బాబా, లక్ష్మీ హయగ్రీవ స్వామి, మాలికాపుర అమ్మవారు, దక్షిణామూర్తి స్వామి, దత్తాత్రేయ మొదలైన ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు.

ఈ ఆలయంలో నిత్యం జరిగే పూజలు, ధూపదీప నైవేద్యాల సమర్పణ భక్తులకు శబరిమలలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. “శ్రీ ధర్మ శాస్తా ఆధ్యాత్మిక కేంద్రం” అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. మణికంఠుడి నామంతో ఇక్కడి పరిసరాలు మార్మోగుతాయి. అయ్యప్ప మాలధారులు, భక్తులతో ఈ ఆలయం నిత్యం సందడిగా ఉంటుంది.

ఈ ఆలయ నిర్మాణం శబరిమల పద్ధతిలోనే జరిగింది. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తారు. ఆర్థిక ఇబ్బందులతో శబరిమల వెళ్లలేకపోతున్న వారు రాజమండ్రిలోని ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

గోదావరి నది పక్కన ఉండే ఆహ్లాదకర వాతావరణంతో పాటు, ఇటువైపు “స్వామియే శరణం అయ్యప్ప” అని భక్తుల నినాదాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఈ చోటుని చూసి తీరాల్సిందే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వహణ కమిటీ చూసుకుంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తోంది.