Chandrababu Health Bulletin
Chandrababu Health Bulletin : రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రతిరోజు చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు కూడా వైద్య పరీక్షలు చేశామన్నారు. చంద్రబాబు బీపీ, షుగర్, టెంపరేచర్, హార్ట్ బీట్, ఫిజికల్ పరీక్షలు అన్నీ నార్మల్ గానే ఉన్నాయని తెలిపారు.
స్కిన్ ఎలర్జీ ఉందని చంద్రబాబు చెప్పడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుండి వైద్య నిపుణులను తీసుకుని వచ్చామని, వైద్య నిపుణులు పరీక్షలు చేసిన అనంతరం వారి సూచనల మేరకు చంద్రబాబుకి వైద్య సాయం అందిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు తెలిపారు.
”చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎటువంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఆరోగ్యంపై వారం రోజులు పాటు ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తాము. స్కిన్ ఎలర్జీ ఉందని తెలిసిన వెంటనే జైలు అధికారులు స్పందించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ కు జైలు సూపరింటెండెంట్ లేఖ రాశారు. స్కిన్ స్పెషలిస్టును పంపాలని జైలు సూపరింటెండెంట్ లేఖలో పేర్కొన్నారు. చాలా అత్యవసరము, ముఖ్యమైనదని.. వెంటనే వైద్యులను పంపాలని లేఖలో కోరినట్లు” జైలు అధికారులు వెల్లడించారు.
స్కిల్ డెవలప్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు.. గత 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా చర్మ సంబంధ సమస్యలతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న చంద్రబాబుకు ఇటీవలి కాలంలో ఆ సమస్య ఎక్కువైంది. దీనికి తోడు వాతావరణంలో వచ్చిన మార్పులతో డీహైడ్రేషన్ కు కూడా గురయ్యారు. దీంతో జైల్లోనే ఉన్న వైద్యులు చంద్రబాబుకి చికిత్స అందించారు. జైల్లో వైద్యం చేస్తున్నా స్కిల్ అలర్జీ ఎక్కువ కావడంతో ప్రత్యేక వైద్య నిపుణులను పిలిపించామని జైలు అధికారులు తెలిపారు. జీజీహెచ్ నుంచి డెర్మటాలజీ స్పెషలిస్టులు జైలుకి వెళ్లారు. డెర్మటాలజిస్టుల బృందం జైల్లో చంద్రబాబుకి చికిత్స అందిస్తోంది.
స్కిన్ స్పెషలిస్టులు చంద్రబాబుని చెక్ చేసి చికిత్స అందించిన తర్వాత జైలు అధికారులు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బీపీ, షుగర్, హార్ట్ బీట్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయని తెలిపారు. చంద్రబాబుని టెస్ట్ చేసిన స్కిన్ స్పెషలిస్టులు కొన్ని సూచనలు చేశారు. చంద్రబాబు ముఖం, చేతి మీద దద్దుర్లు, కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉందని వారు తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించి ట్యాబ్లెట్స్, ఆయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం కూడా చర్మ వ్యాధి నిపుణులు సూర్యనారాయణ, సునీత జైలులోపలికి వెళ్లి మరోసారి చంద్రబాబుకి టెస్టులు చేయనున్నారు.
ఇన్ ఫెక్షన్ మరింత పెరిగే కనుక చంద్రబాబుని ఆసుపత్రికి కూడా తరలించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గత 33 రోజులుగా చంద్రబాబు సెంట్రల్ జైలులోనే ఉండటం, వాతావరణ పరిస్థితులు, ఎండ తీవ్రత కారణంగా స్కిన్ అలర్జీ తీవ్రంగా పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ట్రీట్ మెంట్ చేసినప్పటికీ కొంత ఇన్ ఫెక్షన్ మాత్రం అలానే ఉంది. రేపటి వరకు చూసి మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. గత నెల రోజులకు పైగా జైల్లోనే ఉండటంతో చంద్రబాబు కొద్దిగా బరువు కూడా తగ్గినట్లుగా వైద్యులు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.