Ayodhya Ramireddy
Ayodhya Ramireddy: అధికారం కోల్పోయిన నాటినుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. గత మూడు రోజుల క్రితం వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. రాజీనామా లేఖను ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ కు అందించారు. ఆయన రాజీనామాను చైర్మన్ ఆమోదించారు. అయితే, విజయసాయిరెడ్డితోపాటు మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డిసైతం రాజీనామా చేస్తున్నాడని ప్రకారం జరిగింది. తాజా, రాజీనామా విషయంపై అయోధ్య రామిరెడ్డి స్పందించారు.
అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2020లో రాజ్యసభకు వెళ్లారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది వరకు ఉంది. అయితే, విజయసాయిరెడ్డి వలే ఆయనకూడా రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తాడని ప్రచారం జరిగింది. గత కొద్దిరోజులుగా ఆయన విదేశాల్లో ఉన్నాడు. తనకు సంబంధించిన పలు వ్యాపారాల్లో పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు. మంగళవారం ఏపీకి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయంకు వచ్చారు. రాజీనామా ప్రచారంపై మీడియా ఆయన్ను ప్రశ్నించింది. రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నారా అంటూ ప్రశ్నించగా.. అదంతా ఫేక్ అంటూ అయోధ్య రామిరెడ్డి సమాధానం ఇచ్చారు.
రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ముందు వరకు పదకొండు మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోవటంతో.. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నలుగురు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. బీద మస్తాన్ రావు టీడీపీ నుంచి ఆర్. కృష్ణయ్య బీజేపీ నుంచి మళ్లీ రాజ్యసభకు వెళ్లారు. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో బలం ఏడుకు తగ్గింది. వీరిలో అయోధ్య రామిరెడ్డి సైతం రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేస్తాడని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న ప్రచారం అంతా ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు.