Ramdev Baba
ఏపీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని యోగా గురువు రామ్‌దేవ్ బాబా అన్నారు. ఉత్తర భారత్ వాసులకు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలు చాలా తెలియవని, వాటి గురించి పరిచయం చేయాలని నేను భావిస్తున్నానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దార్శనికత తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఓ గొప్ప వరమని రామ్‌దేవ్ బాబా అన్నారు. ఏపీలో ఉన్న పర్యాటక విధానం ఎంతో ఆకర్షణీయమని తెలిపారు. సృజన, ప్రొడక్టివిటి, ప్రొఫెషనలిజం, సమర్థత, నిబద్ధత వంటి అంశాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని ప్రశంసించారు.
చంద్రబాబుకు ఉన్న విజన్ మరెవరికీ లేదని కచ్చితంగా చెప్పగలనని రామ్‌దేవ్ బాబా అన్నారు. ఈ వయస్సులోనూ ఎంతో చలాకీగా నిర్ణయాలు తీసుకుంటూ, పాలనను కొనసాగిస్తున్నారని తెలిపారు. యోగా, ఆయుర్వేద, నేచురోపతి లాంటి అంశాలను పర్యాటక ప్రాంతాల్లో అవసరమని చెప్పారు.
హార్సిలీ హిల్స్, అరకు, విశాఖ, రాజమహేంద్రమరం, పిచ్చుక లంక, సూర్యలంక లాంటి మంచి ప్రాంతాలు ఉన్నాయని రామ్‌దేవ్ బాబా తెలిపారు. పారిస్, స్విట్జర్లాండ్, టర్కీ ఇలాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్నాం కానీ మనదేశంలో మరిన్ని అందాలున్నాయని అన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే సుందరమైన ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు.
వీటిని అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని రామ్‌దేవ్ బాబా చెప్పారు. నదీ తీరం, సముద్ర తీరాలు, సుందరమైన ప్రకృతి వనరులు ఏపీ సొంతమని తెలిపారు. దిండి లాంటి ప్రాంతాల్లో వెడ్డింగ్ క్రూయిజ్ లేదా బోట్ లాంటి ప్రాజెక్టు చేపట్టవవచ్చని అన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్ గా ఈ ప్రాంతాన్ని మార్చాలని చెప్పారు. భారతీయ సంప్రదాయ పరంగా వివాహాలు జరిపించేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. ఏపీలో పతంజలి సంస్థ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోందని అన్నారు.