Ap Ministers Rating Tension : ఏపీలో మంత్రుల పనితీరుకు రేటింగ్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఏపీలో మంత్రుల పనితీరుపై నివేదిక కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది. గత జూలై నుంచి డిసెంబర్ వరకు మంత్రుల పనితీరుపై నివేదికలు ఇవ్వాలంది. ఈ కాలంలో మంత్రులు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన ప్రతిపాదనలు, పనితీరుపై రిపోర్ట్ అడిగింది. పనితీరు ఆధారంగా మినిస్టర్లకు రేటింగ్ ఇవ్వనుంది సర్కార్.
గత రెండు క్యాబినెట్లలోనూ నివేదికలు కోరిన సీఎం చంద్రబాబు..
గత రెండు క్యాబినెట్లలోనూ మంత్రుల పనితీరు నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. కానీ, ముగ్గురు తప్ప మిగతా ఎవరూ నివేదికలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం నుంచే ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చింది సీఎంవో. ఒకటి కంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు విడివిడిగా నివేదికలు ఇవ్వాలని సూచించింది.
Also Read : విజయసాయిరెడ్డి రాజీనామాపై బీజేపీ మౌనం వెనుక..?
మంత్రుల పనితీరు, తీసుకున్న నిర్ణయాలపై రేటింగ్..
మంత్రుల పనితీరుపై రేటింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గత జూలై నుంచి డిసెంబర్ వరకు.. మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమాలు, అమల్లో ఉన్న వాటిలో తెచ్చిన సంస్కరణలు, ఇతర నిర్ణయాల అమలు, ప్రతిపాదనలు తదితర సమాచారాన్ని ఆరు నమూనాల ద్వారా ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నివేదికల ఆధారంగా అమాత్యులకు రేటింగ్ ఇవ్వనుంది ప్రభుత్వం.
రేటింగ్ ఆధారంగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు..
ఫిబ్రవరి 6వ తేదీన క్యాబినెట్ సమావేశం కానుంది. ఆ సమావేశంలోనే రిపోర్టులు అందజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమ శాఖలకు చెందిన అధికారులతో నివేదికలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు మంత్రులు. పనితీరుకు రేటింగ్ అంశం.. మంత్రులకు ఒక పరీక్ష లాంటిదని చెప్పొచ్చు. మంత్రి పదవిలో కొనసాగాలంటే పనితీరుపై నివేదికలు చాలా కీలకం కానున్నాయి. వారు సక్రమంగా పని చేసినట్లు రిపోర్టులో తేలితే.. వారి పదవులకు డోకా ఉండదని చెప్పొచ్చు.
Also Read : RRR సంచలనం.. నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించా..
అమాత్యుల్లో గుబులు రేపిన రేటింగ్..
ఈ రేటింగ్ అంశం మంత్రుల్లో గుబులు రేపింది. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరి పదవులు ఊడతాయో అనే టెన్షన్ నెలకొంది. రేటింగ్ ఆధారంగానే పదవులను చంద్రబాబు డిసైడ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మంత్రుల రాజకీయ భవిష్యత్ కు ఈ నివేదికలు చాలా ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. ఇక రేటింగ్ ఆధారంగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందనే వార్తలు అమాత్యుల్లో ఆందోళనను పెంచాయి.
ఎవరి పదవులు ఉంటాయో, ఎవరివి ఊడతాయో అనే భయం పట్టుకుంది. పనితీరు సరిగా లేకపోవడం, అవినీతి ఆరోపణలు రావడం, సమన్వయ లోపం వంటి అంశాలు మంత్రుల రాజకీయ భవిష్యత్ పై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.