Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజీనామాపై బీజేపీ మౌనం వెనుక..?
విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇప్పటికే పలు పార్టీల నేతలు స్పందించారు. బీజేపీ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం.

Purandeswari, Vijayasai Reddy
రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతూ రాజ్యసభ తాజా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను తెలిపారు.
విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. అయితే, బీజేపీ మాత్రం విజయసాయిరెడ్డి రాజీనామాపై మౌనం వహిస్తోంది. బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎవరూ ఈ విషయంపై స్పందించలేదు.
తాను వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తాను రాజీనామా చేయడం కూటమికే లబ్ధి చేకూరుతుందని కూడా విజయసాయిరెడ్డి అన్నారు. అయినప్పటికీ, విజయసాయిరెడ్డి నిర్ణయంపై బీజేపీ మౌనంగా ఉండిపోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది.
విజయసాయిరెడ్డిని వైసీపీని వీడటం వెనుక బలమైన కారణమే ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ దత్త పుత్రుడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ అన్నారు.
అప్పట్లో ఢిల్లీలో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర
ఇంతకాలం విజయసాయిరెడ్డిని బీజేపీ దగ్గర ఉంచి, కేసుల విచారణసాగకుండా చేశారని జగన్‌పై షర్మిల ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీతో ఏవైనా చర్చలు జరపాలంటే ఢిల్లీలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. పార్లమెంటులో పలు బిల్లుల సమయాల్లో ఎన్డీఏ సర్కారుకి వైసీపీ మద్దతు కూడా తెలిపింది. అయితే, ఇప్పుడు ఆ పార్టీ అవసరం బీజేపీకి లేదు.
అయినప్పటికీ విజయసాయిరెడ్డి రాజీనామాపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? అసలు ఆయన రాజీనామా వెనుక బీజేపీ వైఖరి ఏంటి? అన్న సందిగ్థత కొనసాగుతోంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డిపై టీడీపీ, కాంగ్రెస్ చేస్తున్నాయి. బీజేపీ మాత్రం అటు విమర్శలు చేయకుండా, ఇటు అనుకూలంగానూ మాట్లాడకుండా తటస్థంగా వ్యవహరించాలనుకుంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.