Kakani Govardhan Reddy: అమక్ర మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణి దాదాపు రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. పక్కా సమాచారంతో నిన్న బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ కాకాణిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. జూన్ 9 వరకు రిమాండ్ విధించడంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.
కోర్టులో ఇరు పక్షాలకు సంబంధించిన లాయర్లు వాదనలు వినిపించారు. సుమారు గంటన్నర పాటు వాదనలు కొనసాగాయి. కాకాణి తరపున రోజా రెడ్డి, ఉమా మహేశ్వరావు, విజయ్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున కేదార్ నాధ్ వాదించారు. అరెస్ట్ చేసిన సమయం, రిమాండ్ రిపోర్టులో మెన్షన్ సమయం సుమారుగా రెండు గంటల పాటు తేడా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే కేసుకు సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. భోజనం అనంతరం జడ్జి తన నిర్ణయాన్న ప్రకటించారు. 14 రోజుల పాటు కాకాణికి రిమాండ్ విధించారు. కోర్టు ప్రోసీజర్స్ అనంతరం బందోబస్తు నడుమ కాకాణిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు పోలీసులు.
Also Read: వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థత.. గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణతో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు ఉపయోగించారంటూ కాకాణిపై ఆరోపణలు వచ్చాయి. పేలుడు పదార్ధాల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులను బెదిరించారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కాకాణి పై కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు.
ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాకాణికి పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయితే, ఆయన విచారణకు రాలేదు. అంతేకాదు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరిగారు. సుమారు రెండు నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలించాయి. చివరికి బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం కాకాణి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయన బెయిల్ పిటిషన్లను తిరస్కరించాయి. దీంతో అరెస్ట్ తప్పలేదు.
కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు కాకాణిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. జైలు వద్దకు వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రొసీజర్ పూర్తి చేసి తర్వాత కాకాణిని జైలు లోపలకి తీసుకెళ్లారు జైలు అధికారులు. మెడికల్ గ్రౌండ్స్ కింద కాకాణి కోరిన స్పెషల్ కేటగిరి పిటిషన్ ను హోల్డ్ లో పెట్టింది వెంకటగిరి కోర్టు.