Attack On CM Jagan : సీఎం జగన్‌‌ను హత్య చేసేందుకే దాడి- రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

అదృష్టవశాత్తూ సీఎం జగన్ గాయంతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Attack On CM Jagan : ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సీఎంపై దాడి కేసులో నిందితుడు సతీశ్ ఒక్కడినే అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితుల స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసినట్లు సమాచారం.

ఇక, సీఎం జగన్ పై దాడి కేసుకు సంబంధించి సతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన అంశాలను పేర్కొన్నారు. సీఎం జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశాడన్నారు. దాడి వెనుక సీఎం జగన్ ను చంపాలనే ఉద్దేశ్యం ఉందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

”వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. జగన్ లక్ష్యంగా హాని చేయాలనే ఉద్దేశ్యంతో రాయి విసిరాడని ఫిర్యాదులో వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నేరం తీవ్రతను బట్టి హత్యాయత్నంగా కేసు నమోదు చేశాం. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలన చేసి 12 మంది సాక్షుల నుండి వాంగ్మూలాలను నమోదు చేశాం. సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రాఫ్ సేకరించి పరిశీలించాం. 17.4.2024న విశ్వసనీయ సమాచారం అందింది.

విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ ను అరెస్ట్ చేశాం. మధ్యవర్తుల సమక్షంలో అతని సెల్‌ఫోన్, బట్టలు స్వాధీనం చేసుకున్నాం. ఏ-1 వేముల సతీష్ కుమార్ ను ఏ2 వేముల దుర్గారావు ప్రేరేపించాడు. సీఎంను హతమార్చడానికి పదునైన కాంక్రీట్ రాయిని విసిరాడు. జనం మధ్యలోనే ఉండి రాయిని విసిరి.. నడుస్తూ వెళ్లిపోయిన సతీశ్.

కుట్రతో ముందస్తు ఒప్పందం ప్రకారం గురిపెట్టి మరీ జగన్ తలపైకి బలంగా రాయిని విసిరాడు. అదృష్టవశాత్తూ సీఎం జగన్ గాయంతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. వైసీపీ అభ్యర్ది వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా బలంగా దెబ్బ తగిలింది. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన తర్వాతే ఏ1గా సతీశ్, ఏ2గా దుర్గారావులను చేర్చినట్లు కోర్టుకు చెప్పిన పోలీసులు”.

Also Read : సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్.. కోర్టుకు తరలింపు

ట్రెండింగ్ వార్తలు