CM Jagan Attack Case : సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్.. కోర్టుకు తరలింపు

ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో అనూహ్యంగా సతీష్ అనే నిందితుడిని పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.

CM Jagan Attack Case : సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్.. కోర్టుకు తరలింపు

Updated On : April 18, 2024 / 6:54 PM IST

CM Jagan Attack Case : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడి కేసులో నిందితుడు సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిమిత్తం అతన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆ తర్వాత విజయవాడ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో నిందితుడు సతీష్‌ను పోలీసులు హాజరు పరిచారు. ఈ కేసులో దాదాపు 60 మంది అనుమానితులను విచారించారు. అయితే సాంకేతిక ఆధారాలను బట్టి సతీష్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడితో పాటు దుర్గారావు అనే మరో నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తారని భావించారు. అనూహ్యంగా సతీష్ ఒక్కడినే కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

ఈ నెల 13న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏపీ సీఎం జగన్ చేపట్టిన వైసీపీ మేమంతా సిద్దం బస్సు యాత్ర కొనసాగుతుండగా ఆయనపై రాయితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. జగన్‌పై దాడికి నిందితుడు సతీష్ కారణమని నిర్దారణకు వచ్చిన తర్వాత పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అతడికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.

నిందితుడు మేజర్ కాదు మైనర్
పోలీసులు 5 రోజుల క్రితం సతీష్‌ను అదుపులోకి తీసుకుని ఇవాళ కోర్టులో ప్రవేశ పెట్టారని నిందితుడి తరపు న్యాయవాది తెలిపారు. అదుపులోకి తీసుకున్న రోజుకు ఇవాళ్టికీ చాలా వ్యత్యాసం ఉందని, అతడు మేజర్ కాదు మైనర్ అని వెల్లడించారు. నిందితుడి ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సతీష్‌కు ఎటువంటి నేరచరిత్ర లేదని, అతడో ఆకతాయి అని తెలిపారు. రాయి కొట్టినంత మాత్రాన హత్యాయత్నం కేసు పెడతారా అని ప్రశ్నించారు.

Read Also : Lok sabha Elections 2024 : రేపే సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్.. బరిలో ప్రముఖులు