Road Accident
Road Accident : తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో ఏపీలోని కర్నూల్ జిల్లాలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదంకుగురై అనేక మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. కాగా.. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో 19మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.. కాగా.. మంగళవారం ఏపీలో మరో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
ఏలూరు జిల్లా లింగపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు జూబ్లీనగర్ సమీంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడిని లింగపాలెం మండలానికి చెందిన ప్రవీణ్ బాబుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్ సహా 17మంది ఉన్నారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బస్సు అదుపు తప్పినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
ఏపీలో మంగళవారం తెల్లవారు జామున మరో బస్సు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని దామాజిపల్లి వద్దనున్న 44వ జాతీయ రహదారిపై ఐచర్ వాహనాన్ని ఢీకొని ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా అర్ధరాత్రి 2గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు.