అంగన్‌వాడీల వేతనాలు పెంపు, సమ్మెపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వం నిజాయితీగా ఉన్న విషయం చెబుతోంది. రాజకీయ అజెండాకు అంగన్ వాడీలు బలికావద్దు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు.

Sajjala Ramakrishna Reddy On Anganwadis Strike (Photo : Google)

Anganwadi Workers Strike : అంగన్ వాడీల సమ్మె, వేతనాల పెంపు డిమాండ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంగన్ వాడీల వేతనాలు పెంచలేము అని సజ్జల తేల్చి చెప్పారు. వేతనాలు పెంచలేము కాబట్టే చేయలేమని చెబుతున్నామన్నారు. ఎన్నికల అనంతరం అప్పటి పరిస్థితులను బట్టి వేతనాల పెంపు చూస్తామని క్లారిటీ ఇచ్చారు సజ్జలజ

వేతనాలు పెంచాలనే డిమాండ్ పైనే అంగన్ వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారని చెప్పారు. ఎస్మాతో అంగన్ వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాజకీయ నాయకులు వెనుక ఉండి అంగన్ వాడీల సమ్మెను నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. యూనియన్ నేతల ఆడియో క్లిప్పింగుల్లో ఈ విషయం బయటపడిందన్నారు. పరిష్కారమయ్యేవన్నీ సీఎం జగన్ చేస్తూనే వచ్చారని వివరించారు.

Also Read : అంగన్‌వాడీలకు ముగిసిన డెడ్‌లైన్, నెక్ట్స్ ఏం జరగనుంది?

”ప్రభుత్వం నిజాయితీగా ఉన్న విషయం చెబుతోంది. భవిష్యత్తులో వేతనాలు పెంచుతాం, సమ్మెను విరమించాలని మరోసారి అంగన్ వాడీలని కోరుతున్నాం. రాజకీయ అజెండాకు అంగన్ వాడీలు బలికావద్దు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరిపైనా ఎక్కడా దురుసుగా వ్యవహరించవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యామ్నాయ చర్యలకు అడ్డుపడితే మాత్రం చర్యలు తీసుకుంటాం. తెగేంత వరకు లాగడం మంచిది కాదు. మావైపు నుంచి అలాంటిది ఉండదు. మీ వైపు నుంచి అలా చేయవద్దు” అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

‘అంగన్ వాడీల సమ్మెలో రాజకీయ ప్రమేయం ఉంది. కొన్ని శక్తులు ఈ సమ్మెను నడిపిస్తున్నాయి. మేము వారికి చేయాల్సింది చేశాం. ఎంతకాలం సమ్మెలో ఉంటారు? ఇంతకాలం నచ్చచెబుతూనే ఉన్నాం. జైలుకైనా పోతామంటూ కొందరు అంగన్ వాడీ వర్కర్ల సంఘం నేతలు అంటున్నారు. ఇప్పుడే జీతాలు పెంచలేము అని చెబుతూనే ఉన్నాం. మళ్లీ గెలిచాక జీతాల పెంపుపై ఆలోచిస్తాం. ఇప్పటికైనా సమ్మెపై వెనక్కి తగ్గాలి’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

కాగా.. అంగన్ వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైడ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. రేపటి నుంచి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవల కింద అంగన్ వాడీల సేవలు ఉన్నాయి కాబట్టి విధుల్లో చేరకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సమ్మెలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అయితే, అంగన్ వాడీలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని, తమ న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని.. అప్పటివరకు కూడా సమ్మెను కొనసాగిస్తామని అంగన్ వాడీ వర్కర్లు తేల్చి చెప్పారు.

Also Read : పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?

ప్రభుత్వం తమపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. అన్నింటికీ సిద్ధపడే ఉన్నామన్నారు. సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించేలా ఉత్తర్వులు జారీ చేసేవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్ వాడీలు తేల్చి చెప్పారు. తమను అరెస్ట్ చేసినా, విధుల్లో నుంచి తొలగించినా, ఎస్మా ప్రయోగించినా భయపడేది లేదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.