పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?

అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బరిలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?

ushashri charan versus savithamma in penukonda

Updated On : January 8, 2024 / 1:06 PM IST

Penukonda Assembly constituency: అనంతపురం పెనుకొండ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రత్యర్థిని బట్టి అభ్యర్థుల మార్పు చేస్తుండటంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఇన్నాళ్లూ పెనుకొండలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పార్థసారథికే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా మంత్రి ఉషశ్రీ పెనుకొండ నుంచి పోటీకి దిగడంతో.. టీడీపీ కూడా అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. ఇక్కడ ఉషశ్రీకి పోటీగా ఆమె సామాజిక వర్గానికే చెందిన.. సవితమ్మను బరిలో దింపనుంది తెలుగుదేశం.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బరిలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో అందరి చూపు పెనుకొండ నియోజకవర్గం వైపు మళ్లింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథితో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ టికెట్ ఆశించారు. అయితే.. చంద్రబాబు మాత్రం పార్థసారథికే అవకాశం కల్పిస్తారన్న చర్చ జోరందుకుంది.

ఈ తరుణంలో కల్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ సెగ్మెంట్‌ను మార్చిన సీఎం జగన్.. ఆమెను పెనుకొండ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో ఉషశ్రీకి పోటీగా సవితమ్మను రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ. అయితే.. వీరిద్దరిదీ కురబ సామాజికవర్గమే కావడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

Also Read: గుంటూరులో ఎన్నికల వేడి.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?

సవితమ్మ స్థానికురాలు కావడం, సేవా కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేసే తత్వం ఉండటం ఆమెకు కలిసివచ్చే అంశాలుగా మారాయి. ఉషశ్రీ విషయంలో స్థానికత ప్రధాన భూమిక పోషించనుండగా.. ఇప్పటికే పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గీయులు ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉషశ్రీ పెనుకొండ నుంచి పోటీ చేయొద్దని సొంత పార్టీ నేతలే రోడ్డెక్కడం కాస్త ఇబ్బందిగా పరిణమించింది. ఇవన్నీ టీడీపీ అభ్యర్థి సవితమ్మకు లాభించే అంశాలుగా మారాయి.

Also Read: వైసీపీలో మార్పులు.. ఎవరు సేఫ్? మంత్రులు, మాజీ మంత్రుల్లో టెన్షన్ టెన్షన్

తెరపైకి స్థానికత అంశం
అయితే.. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు మంత్రి ఉషశ్రీ. స్థానికత అంశం తెరపైకి రాకుండా ఉండేందుకు.. ఇప్పటికే పెనుకొండలో సొంత ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారామె. ఇక వైసీపీలో ఉన్న గ్రూపులన్నంటినీ ఒక తాటిపైకి తీసుకువస్తూనే.. టీడీపీలో ఉన్న వర్గ విభేదాలను తనకు అనుకూలంగా మలచుకునే వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు పార్థసారథికి టికెట్ రాకపోవడంతో కినుక వహించే అవకాశాలున్న నేపథ్యంలో ఆయన్ను అనంతపురం ఎంపీగా బరిలో దింపే యోచన చేస్తోంది టీడీపీ. తద్వారా ఇద్దరు ముఖ్య నేతలకు సముచిత స్థానం కల్పించామన్న చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. మొత్తంగా పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య సాగనున్న పోరులో ఎవరు విజయం సాధిస్తారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.