Prakash Raj
తిరుమల తిరుపతి లడ్డూ వివాదం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్ష వేళ ప్రకాశ్ రాజ్ కొన్ని రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఇవాళ మరోసారి ఎక్స్‌లో సంచలన కామెంట్స్ చేశారు. ”కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ.. కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి” అంటూ తెలుగు, ఇంగ్లిష్‌లో ఆయన కామెంట్లు చేశారు.
కాగా, లడ్డూ వివాదంపై ప్రకాశ్ రోజుకో ట్వీట్ చేస్తున్నారు. ”దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి” అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యను కూడా ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ”మనకేం కావాలి… ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా?” అంటూ ఇటీవల ట్వీట్లు చేశారు.
”గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం?జస్ట్ ఆస్కింగ్?” అంటూ ప్రకాశ్ రాజ్ కొన్ని రోజుల క్రితం ప్రశ్నించారు. లడ్డూ వివాదం వేళ ప్రకాశ్ రాజ్ మొదట చేసిన ట్వీట్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రకాశ్ రాజ్ వెనక్కి తగ్గకుండా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.