దేనికైనా ఒక హద్దు ఉంటుంది. విమర్శ, ప్రతి విమర్శ. ఇవన్నీ కామన్. కానీ ఈ క్రమంలో గీత దాటితేనే ప్రాబ్లమ్. టంగ్ స్లిప్ ఎవరైనా ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదు. వన్స్ లైన్ క్రాస్ అయితే స్థాయితో సంబంధం లేకుండా ఎవరైనా సమస్యల్లో చిక్కుకోవాల్సిందే. ఇప్పుడు ఏపీ అమరావతి రైతుల విషయంలో..కొందరు చేసిన కామెంట్స్‌ను చూస్తే అదే అనిపిస్తుంది.
జర్నలిస్టులు, ఎనలిస్టులు, మేధావుల ముసుగులో ఏకంగా మహిళలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేదే చర్చనీయాంశంగా మారింది. అమరావతి మహిళల మీద నోరు పారేసుకోవడం తీవ్ర దుమారం లేపుతోంది. ఓ న్యూస్ ఛానల్‌లో టెలీకాస్ట్ అయిన చర్చా కార్యక్రమంలో అమరావతి వేశ్యల రాజధాని ఓ జర్నలిస్టు మాట్లాడటం..ఆ ప్రోగ్రామ్ హోస్ట్‌గా ఉన్న ఇంకో సీనియర్ జర్నలిస్ట్..సదరు వ్యక్తి మాటలను ఖండించకపోవడం వివాదాస్పదం అవుతోంది.
మీడియా అంటేనే పబ్లిక్‌ను ఇన్‌ప్లుయెన్స్ చేసేది. అలాంటి మీడియాలో మహిళలను అడ్డగోలుగా మాట్లాడటం ఎలా సమర్ధనీయమో అర్థం కాని పరిస్థితి. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితేనే వాళ్లకు మంచిది..సామాజానికి కూడా మంచిది. టంగ్ స్లిప్ అయితే ట్రబుల్స్ తప్పవు. పైగా ఎన్నో ఏళ్లు కష్టపడి ఓ ఫీల్డ్‌లో ఉండి అంతో ఇంతో పేరు తెచ్చుకుని ఓ స్థాయికి వచ్చాక..ఎవరినో సంతృప్తి పరచడం కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడటం అనేది ఎవరు చేసినా కరెక్ట్ కాదు.
Also Read: లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురి మృతి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై డోర్లన్నీ ఇలా..
ఎవరూ సమర్ధించరు కూడా. రాజకీయ నాయకులు అయినా, జర్నలిస్టులు అయినా..ఇంకెవరైనా నోరు జారడం అంటేనే..స్థాయిని దిగజార్చుకోవడం అని అర్థం. అన్నింటికి మించి మహిళల విషయంలో ఎంత జాగ్రతగా మాట్లాడితే అంత మంచిదనేది అందరికీ తెలిసిన విషయమే. మాట అనడం చాలా సింపుల్. దాని పర్యావసనాలు ఫేస్ చేయడమే కష్టం. ఇప్పుడేం లాభం..అమరావతి మహిళల ఆగ్రహావేశాలతో సదరు జర్నలిస్ట్ అరెస్ట్‌కు దారి తీసింది.
అరెస్ట్ వరకే సరిపోతుందనుకుంటే పొరపాటే. మీడియా రంగంలో పేరున్న వ్యక్తిగా ఉండి సభ్యసమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ సారీ చెప్పినా ఇప్పుడు ఇష్యూ సద్దుమణిగిపోవచ్చు కానీ..సదరు వ్యక్తులకు లైఫ్ లాంగ్ ఆ మరక పోదు. ఇలాంటి సమయంలో తాము మాట్లాడిన మాటలు కరెక్టేనని సదరు వ్యక్తులు సమర్థించుకోగలరా అంటే సమాధానం లేని ప్రశ్నే అని చెప్పొచ్చు. టంగ్ స్లిప్ అవడం ఎందుకు..తలనొప్పులు తెచ్చి పెట్టుకోవడం ఎందుకు.? అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్.
ఏం మాట్లాడినా నడుస్తుందిలే అనుకున్నారా?
నోటి దురుసుతో కటకటాల పాలైనవారు ఎవరో..ఇంకా ఎవరెవరో లైన్‌లో ఉన్నారో అందరికీ తెలిసింది. పైగా మహిళలను కించపరుస్తూ కామెంట్ చేసిన వాళ్ల పరిస్థితి ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా రంగంలో ఉండి..రెగ్యులర్‌గా డిస్కషన్లు, ఎనాలిస్‌లు చేసే జర్నలిస్టులు, ఎనలిస్టులు మహిళలను నోరు జారి మాట్లాడటం సహించరానిది.
అయితే అధికార, అపోజిషన్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తిట్టుకోవడం, ట్రోల్ చేసుకోవడం వేరు. లీడర్లు, జర్నలిస్టులు ఓపెన్‌గా బూతులు, అసభ్యకర మాటలు మాట్లాడటం వేరనే చిన్న లైన్‌ను కొందరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే నోరు జారిన వ్యక్తులు వ్యవహారం ఇంత దాక రాదనుకున్నారా.? లేకపోతే ఏం మాట్లాడినా నడుస్తుందిలే అనుకుని కేర్‌లెస్‌గా మాట్లాడారో తెలియదు కానీ..ఇప్పుడు ప్రజల దృష్టిలో దోషిగా నిలబడే పరిస్థితి వచ్చిందా రాలేదా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే.
అమరావతి మహిళలను ఉద్దేశించి మొహానికి రంగులేసుకుని కూర్చుంటున్నారంటూ అప్పట్లో మాట్లాడారు. అమరావతి ఒక శ్మశానమని ఇంకో పెద్దమనిషి నోరుపారేసుకున్నారు. అక్కడి ఆడబిడ్డలను పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ లీడర్లు హేళన చేసిన సందర్భాలు ఉన్నాయ్. అయితే ఈ విషయంలోనే కాదు మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా తప్పే. కానీ లీడర్లు దాన్ని ఫాలో కావడం లేదు.
లేటెస్ట్‌గా కొందరు జర్నలిస్టులు, ఎనలిస్టులు ముసుగులో అలా మాట్లాడటం కూడా ఆమోదయోగ్యం కాదు. ఎవరైనా సరే మహిళల ఆత్మాభిమానాన్ని, గౌరవ మర్యాదలను మంటగలిపే వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే. పార్టీలు, నాయకులు, స్థాయిలు, హోదాలతో సంబంధం లేదు. ఆ లెక్కకు వస్తే మహిళలను గౌరవించని వాడు మనిషే కాదు. రాబోయే రోజుల్లో ఇలాంటివి రిపీట్ కావొద్దంటే..విద్వేషం తలకెక్కి అవాకులు, చెవాకులూ పేలుతున్నవారిని కట్టడి చేయాల్సిందేనంటోంది మహిళా లోకం.