ఏపీని ఏకీపారేస్తున్న ఎండలు.. వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు.. ఉదయం నుంచే ఉక్కపోత..

ఆంధ్రప్రదేశ్ ప్రజలను మండే ఎండలు అల్లాడిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

Heatwave Andhra Pradesh: దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉత్తర భారత దేశం వేడిగాలులతో అల్లాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతలకు గురవుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వాడుతుండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

విజయవాడ అర్బన్ ప్రజలకు APSDMA హెచ్చరిక
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ మండల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) శుక్రవారం ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. మండలంలో నేడు వడగాలులతో పాటు 45.1°C ఉష్ణోగ్రత వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. మండల వాసులంతా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిన్న విజయవాడ అర్బన్‌లో 43.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయింది.

వడదెబ్బతో యువకుడి మృతి?
శ్రీకాకుళం జిల్లా మందస మండలం రామరాయి గ్రామ వ్యవసాయ పొలాల్లో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు పలాస మండలం సున్నాడ గ్రామానికి చెందిన కుమ్మరి గణపతి(30)గా గుర్తించారు. వడదెబ్బ కారణంగా మృత్యువాత పడినట్లు భావిస్తున్నారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఆరు నూరైనా రిజల్ట్ ఇదే..! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు

145 మండలాల్లో తీవ్ర గాల్పులు: వాతావరణ శాఖ
ఏపీలోని 145 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నిన్న ప్రకాశం జిల్లా పామూరులో 44.8, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.