Power
Power Outage: విశాఖ జిల్లాలోని ఎన్టీపీసీ సింహాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని మొత్తం నాలుగు యూనిట్లలో ఒకేసారి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఇక్కడి నుంచి ఇతర సబ్ స్టేషన్లకు చేరాల్సిన విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. గ్రిడ్ నుంచి ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే మంగళవారం ఉదయం కలిగిన తీవ్ర అంతరాయం కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని కలపాక 400కేవీ సబ్ స్టేషన్ కు సరఫరా నిలిచిపోయింది.
Also read:HighCourt Shocks Smita Sabharwal : రూ.15లక్షలు తిరిగి ఇచ్చేయండి.. స్మితా సబర్వాల్‌కు హైకోర్టు షాక్
మంగళవారం ఉదయం దాదాపు రెండు గంటల పాటు విద్యుత్ అంతరాయం చోటుచేసుకోగా..హుటాహుటిన స్పందించిన అధికారులు..తాత్కాలికంగా విజయనగరం జిల్లా మరడం 400 కేవీ విద్యుత్ స్టేషన్ నుంచి పాక్షికంగా విద్యుత్ పునరుద్ధరించారు. మరోవైపు పెదగంట్యాడ మండలం పాలవలస హిందుజా పవర్ ప్లాంట్ లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. 1040 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో అత్యవసర పునరుద్ధరణ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దక్షిణాది గ్రిడ్ లో సాంకేతిక లోపం వలనే ఎన్టీపీసీ, హిందుజా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. కాగా సింహాద్రి ఎన్టీపీసీలోని నాలుగు యూనిట్లలో ఒకేసారి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడం ఇదే తొలిసారి.